శ్రీరామ పునర్వసు దీక్ష ప్రారంభం
వైభవంగా శ్రీరామగిరి ప్రదక్షిణ
ముత్తంగి అలంకరణలో రామయ్య
భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో భక్తులు శ్రీరామ పునర్వసు దీక్షను సోమవారం పవిత్రంగా స్వీకరించారు. కార్తీకమాసం పునర్వసు నక్షత్రం సందర్భంగా శ్రీరామదీక్షను ఆలయ అధికారులు ప్రారంభించారు. ఈ సందర్భంగా అర్చకులు దీక్షా మాలలను స్వాముల మెడలో అలంకరించారు. అనంతరం కంచర్ల గోపన్న సేవా సమితి ఆధ్వర్యలో చేపట్టిన భద్రగిరి ప్రదక్షిణ వేడుకగా సాగింది. కాగా శ్రీరామ పునర్వసు దీక్ష విరమణ డిసెంబర్ 8వ తేదీన జరగనుందని అర్చకులు తెలిపారు. కార్యక్రమంలో ట్రస్ట్ నిర్వాహకులు కంచర్ల శ్రీనివాసరావు, ఆలయ ఏఈఓ శ్రావణ్‌కుమార్, పర్యవేక్షకులు లింగాల సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.
రామయ్యకు ముత్తంగి అలంకరణ..
అంతరాలయంలోని మూలమూర్తులు సోమవారం ముత్తంగి అలంకరణలో దర్శనం ఇచ్చారు. తెల్ల వారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కాగా, కార్తీక సోమవారం సందర్భంగా చిత్రకూట మండపంలో సత్యనారాయణ స్వామి వ్రతాలను ఘనంగా నిర్వహించారు. సీతారాముల ఉత్సవ మూర్తులను వేదికపై కొలువుదీర్చి వ్రతం నిర్వహించిన అర్చకులు.. ఆ విశిష్టతను వివరించారు. వ్రతంలో పాల్గొన్న భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం గోదావరికి నదీ హారతి సమర్పించారు.
శ్రీరామ పునర్వసు దీక్ష ప్రారంభం


