ఆమె చేతిలో విద్యుత్‌! | - | Sakshi
Sakshi News home page

ఆమె చేతిలో విద్యుత్‌!

Nov 10 2025 7:40 AM | Updated on Nov 10 2025 7:40 AM

ఆమె చేతిలో విద్యుత్‌!

ఆమె చేతిలో విద్యుత్‌!

400 మంది మహిళలకు చేయూత..

రాష్ట్రంలోనే తొలిసారి ఖమ్మం జిల్లాలో ఏర్పాటుకు ప్రణాళిక

వెంకటాపురంలో భూకేటాయింపు, రూ.3 కోట్ల రుణం కూడా..

ఎర్రుపాలెం: ఖమ్మం జిల్లాలోని ఎర్రుపాలెం మండలం వెంకటాపురం, నారాయణపురం ఐకేపీ సంఘాల ద్వారా త్వరలోనే సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటు కానుంది. మహిళా సంఘాల సభ్యులను ఆర్థికంగా బలోపేతం చేసేలా ప్రభుత్వం పలు పథకాలు అమలుచేస్తోంది. ఈ క్రమంలోనే సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటు, నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది. ఈ మేరకు మధిర నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సూచనలతో రాష్ట్రంలోనే తొలిసారి పైలట్‌ ప్రాజెక్టుగా వెంకటాపురం, నారాయణపురం సంఘాలను ఎంపిక చేశారు. ఇప్పటికే మండల ఐకేపీ(చైతన్య) సమాఖ్య ద్వారా రూ.36లక్షలతో బస్సు కొనుగోలు చేసి ఇల్లెందు ఆర్టీసీ డిపోకు అద్దె ప్రాతిపదికన ఇచ్చారు. తద్వారా ప్రతీ నెల సమాఖ్యకు రూ.69,468 అద్దె రూపంలో లభిస్తోంది. ఇందులో రుణం పోగా కొంత ఆదాయం సమకూరుతోంది. ఇప్పుడు సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు కూడా ఈ మండలంలోని సమాఖ్యలను ఎంపిక చేయడం విశేషం.

రోజుకు 4వేల యూనిట్లు

ఎర్రుపాలెం మండలం రాజుపాలెం రెవెన్యూ పరిధి వెంకటాపురంలోని సర్వే నంబర్‌ 102లో సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు నాలుగు ఎకరాల భూమి కేటాయించారు. ఇందులో ప్లాంట్‌ ఏర్పాటుకు ప్రభుత్వం రూ.3 కోట్లు బ్యాంకు ద్వారా రుణం మంజూరు చేయించింది. అలాగే, నిర్మాణ పనులను సాయి బాపూజీ ప్రాజెక్టు ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ టెండర్‌ ద్వారా దక్కించుకోగా.. నిర్మాణం పూర్తయ్యాక ఏడాది పాటు ఈ సంస్థే నిర్వహణ బాధ్యతలు చూస్తుంది. ఇక 25 ఏళ్ల పాటు వారంటీతో కూడిన సోలార్‌ పలకలు ఏర్పాటుచేస్తారు. ప్లాంట్‌ ద్వారా రోజుకు 4వేల యూనిట్ల చొప్పున నెలకు 1.20లక్షల యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించారు. ఈ విద్యుత్‌ను ఎన్పీడీసీఎల్‌ యూనిట్‌కు రూ.3.13 చొప్పున కొనుగోలు చేసేలా ఒప్పందం కుదిరింది. కాగా, ప్లాంట్‌ నుంచి వెంకటాపురం సబ్‌స్టేషన్‌ వరకు లైన్‌ వేసి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌నుగ్రిడ్‌కు అనుసంధానిస్తారు. ఈ ప్లాంట్‌ పనులకు త్వరలోనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేయనున్నారు.

ముమ్మరంగా పనులు

వెంకటాపురంలో సోలార్‌ ప్లాంట్‌ నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించిన నాలుగెకరాల భూమిలో ఏర్పా ట్లు చకాచకా జరుగుతున్నాయి. ఇప్పటికే భూమిని చదును చేయించి చుట్టూ పిల్లర్లు వేసేందుకు కందకాలు తవ్విస్తున్నారు. అంతేకాక వెంకటాపురం నుంచి ప్లాంట్‌ వరకు రూ.46 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించారు. త్వరలోనే శంకుస్థాపన జరిగితే, డిసెంబర్‌ నెలాఖరు నాటికి ప్లాంట్‌ ఏర్పాటుచేయాలనే లక్ష్యంతో ఉన్నారు.

సోలార్‌ ప్లాంట్‌ ద్వారా వెంకటాపురం, నారాయణపురం గ్రామాల్లోని శ్రీకృష్ణ, ఉషోదయ సమాఖ్యల్లో సభ్యులుగా ఉన్న 400 మంది మహిళలకు ఆర్థికంగా చేయూత దక్కనుంది. ప్లాంట్‌ ద్వారా నెలకు ఉత్పత్తి అయ్యే 1.20లక్షల యూనిట్ల విద్యుత్‌ను ఎన్పీడీసీఎల్‌ యూనిట్‌కు రూ.3.13 చొప్పున కొనుగోలు చేస్తుంది. తద్వారా నెలకు రూ.3.75 లక్షలు, ఏడాదికి రూ.45.07లక్షల ఆదాయం వస్తుంది. ఈ ఆదాయంలో కొంత రుణం చెల్లిస్తే 6 – 7 ఏళ్లలో బకాయి తీరుతుంది.

ఐకేపీ సంఘాల ద్వారా సోలార్‌ ప్లాంట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement