శ్రీకనక దుర్గమ్మతల్లికి విశేష పూజలు
పాల్వంచరూరల్: శ్రీకనకదుర్గమ్మ తల్లికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయానికి ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అమ్మవారిని దర్శించుకుని పూజలు జరుపుకున్నారు. భక్తులు తలనీలాలు సమర్పించారు. ఒడి బియ్యం, చీరలు, కుంకుమ, పసుపు, గాజులు అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించారు. అర్చకులు అభిషేకం జరిపారు. ఈఓ ఎన్ రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
నేడు ప్రజావాణి
సూపర్‌బజార్(కొత్తగూడెం): కొత్తగూడెం ఆర్డీఓ, భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయాల్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు భూ సమస్యల పరిష్కారం కోసం సుదూర ప్రాంతాల నుంచి ప్రజావాణి కార్యక్రమానికి వస్తున్నారని పేర్కొన్నారు. వారి సౌకర్యం కోసం డివిజన్ల వారీగా ప్రజావాణి నిర్వహణకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇతర సమస్యలపై దరఖాస్తు చేసుకునేవారు కలెక్టరేట్ ఇన్‌వార్డ్‌లో అర్జీలు అందజేసి రశీదులు పొందాలని సూచించారు. పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు.
అదనపు జీఎంలకు ఉద్యోగోన్నతి
కొత్తగూడెంఅర్బన్: సింగరేణిలో పని చేస్తున్న ఇద్దరు అదనపు జీఎంలకు జీఎంలుగా ఉద్యోగోన్నతి కల్పిస్తూ శనివారం రాత్రి ఈఈ సెల్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగోన్నతి పొందిన వారిలో ఎస్.వెంకటాచారి, సీహెచ్.వెంకటరమణ ఉన్నారు.
ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు
దుమ్ముగూడెం : మండలంలోని పెదపాడు లక్ష్మీనగరం ఎంపీపీఎస్‌ల ఉపాధ్యాయులు మోహన్‌కుమార్, బొడ్డు నాగేశ్వరరావులు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను అందుకున్నారు. ఆదివారం హైదరాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో జీసీఎస్ వల్లూరి ఫౌండేషన్, శ్రీ ప్రగతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవార్డులను ప్రదానం చేశారు. హరియాణ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎంపీ ఆర్. కృష్ణయ్య, మల్కాజిగిరి డీసీపీ వెంకటరమణ ముఖ్యఅతిథులుగా హాజరైన అవార్డులను అందించారు. అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఓపెన్ కోర్సులు
రెగ్యులర్‌తో సమానం
టీఓఎస్‌ఎస్ రాష్ట్ర పరిశీలకురాలు జ్యోతి
బూర్గంపాడు: రెగ్యులర్ టెన్త్, ఇంటర్, డిగ్రీ కోర్సులతో సమానంగా ఓపెన్ టెన్త్, ఇంటర్, డిగ్రీ కోర్సులు ఉంటాయని తెలంగాణ ఓపెన్‌స్కూల్ సొసైటీ రాష్ట్ర పరిశీలకురాలు జ్యోతి అన్నారు. బూర్గంపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఓపెన్ టెన్త్, ఇంటర్ క్లాసులను ఆదివారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓపెన్ టెన్త్, ఇంటర్ చదివిన విద్యార్థులు రెగ్యులర్ కోర్సులు చదివిన విద్యార్థులతో సమానంగా డిగ్రీ కోర్సుల్లో చేరవచ్చన్నారు. అనివార్య కారణాలతో చదువులు మధ్యలో ఆపేసినవారు ఓపెన్ విధానంలో ఉన్నత విద్యను అభ్యసించాలన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
కొత్తగూడెంఅర్బన్: సింగరేణిలో అంతర్గత పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జీఎం(పర్సనల్)ఈఈ అండ్ ఆర్‌సీ అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అసిస్టెంట్ ఇంజనీర్(ఈఅండ్‌ఎం) ఈ–2గ్రేడ్‌లో 23, అసిస్టెంట్( సివిల్ ) ఈ–2 గ్రేడ్‌లో 4, జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఈఅండ్‌ఎం) ఈ–1 గ్రేడ్‌లో 33, జూనియర్ ఎగ్జిక్యూటివ్ (సివిల్)లో 6, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ ఈ–1 గ్రేడ్‌లో 16 పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. అర్హులు ఈ నెల 24లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
శ్రీకనక దుర్గమ్మతల్లికి విశేష పూజలు


