భద్రగిరిలో భక్తుల సందడి
కార్తీక మాసం వేళ రామాలయంలో రద్దీ
శ్రీసీతారామ చంద్రస్వామివారికి అభిషేకం, సువర్ణ పుష్పార్చన
భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి కొలువై ఉన్న భద్రగిరి ఆదివారం రద్దీగా మారింది. కార్తీక మాసంలో వారాంతపు రోజులు కావడంతో రామయ్య దర్శనానికి భక్తులు తరలివచ్చారు. పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి, కార్తీక దీపాలను వెలిగించారు. అనంతరం క్యూలైన్ల ద్వారా అంతరాలయంలో స్వామివారి మూలమూర్తులను దర్శించుకున్నారు. క్యూలైన్లు కిటకిటలాడటంతో స్వామివారి ఆర్జిత సేవలను సైతం కొద్ది సేపు నిలిపివేసి ప్రత్యేక దర్శనానికి అవకాశం కల్పించారు. ఆదివారం సందర్భంగా అభిషేకం, సువర్ణ పుష్పార్చన జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు.
చిత్రకూట మండపంలో
సత్యనారాయణస్వామి వ్రతం
చిత్రకూట మండపంలో కార్తీక మాసం సందర్భంగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని అర్చకులు ఘనంగా జరిపారు. ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై స్వామివారి ఉత్సవ మూర్తులను కొలువుదీర్చి పూజలు చేశారు. అర్చకులు, వ్రత మహత్యాన్ని, భద్రగిరిలో వ్రత కల్పన విశిష్టతను వివరించారు. అనంతరం భక్తులు స్వామివారిని అంతరాలయంలో దర్శించుకున్నారు.


