చదువు, నిద్ర ఒకేచోట..
సకల వసతులు కల్పించాలి
స్థలం కేటాయించారు..
ఒకే కాంపౌండ్‌లో లేని వసతులు
తక్కువ సంఖ్యలో విద్యార్థినులు
దూరంగా ఉన్న ల్యాబ్, లైబ్రరీ
సరిపడాలేని భవనాలు
దమ్మపేట: మండల పరిధిలోని అంకంపాలెం గిరిజన సంక్షేమ గురుకుల బాలికల డిగ్రీ కళాశాలలో వసతులు, మౌలిక సదుపాయాల కల్పన లేమితో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంకంపాలెంలోని ఓ తాత్కాలిక భవన సముదాయంలో 2017లో ప్రారంభమైన ఈ కళాశాల కొన్నాళ్లకే సరిపడా వసతులు, భవనాలు లేక ఖమ్మం జిల్లా పరిధి తనికెళ్లలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీకు బదిలీ చేసి అక్కడే తరగతులు నిర్వహించారు. తదుపరి ఏ జిల్లాకు సంబంధించిన కళాశాలను అదే జిల్లాలోనే నిర్వహించాలనే నిబంధన కారణంగా అశ్వారావుపేటలోని పెదవాగు ప్రాజెక్టులో ఉన్న గిరిజన ఆశ్రమ బాలుర పాఠశాలలో తాత్కాలికంగా తరగతులను నిర్వహించారు. కాగా, ఈ పాఠశాలకు రావడానికి సరియైన రవాణా సౌకర్యం లేకపోవడంతో కళాశాలలో ప్రవేశానికి విద్యార్థులు ఆసక్తి చూపకపోవడంతో ప్రస్తుత విద్యా సంవత్సరానికి తిరిగి అంకంపాలెం గ్రామానికి తరలించారు. ఇలా పలుమార్లు కళాశాల పలు ప్రాంతాలకు తిరుగాడుతూ ఉండటం వలన కళాశాలలో ప్రవేశానికి విద్యార్థులు కూడా అంతగా ఆసక్తి చూపడం లేదు.
తరగతి గదులే డార్మెటరీ గదులు..
అంకంపాలెంలోని ఓ తాత్కాలిక భవనంలో నిర్వహించబడుతున్న ఈ గిరిజన సంక్షేమ గురుకుల బాలికల డిగ్రీ కళాశాలలో బీఏ, బీకామ్, బీజెడ్సీ, బీఎస్సీ విభాగాలకుగాను మూడేళ్లకు కలిపి మొత్తం 208 మంది విద్యార్థినులు ఉన్నారు. వీరికి బోధన నిమిత్తం మొత్తం 12 తరగతి గదులు ఉన్నా.. వసతుల కోసం ప్రత్యేకమైన డార్మెటరీ గదులు లేవు. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు బోధన పూర్తయిన తర్వాత, ఆ తరగతి గదులనే వసతి గదులుగా వినియోగించుకోవాల్సి వస్తోంది. దీంతో ఎవ్వరికీ ఏమీ చెప్పుకోలేక అరకొర వసతులతోనే విద్యార్థులు తమ చదువులను కొనసాగిస్తున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆదివాసీ నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
భవిష్యత్‌లో మరింత భారం..
గిరిజన బాలికల డిగ్రీ గురుకులంలో మూడేళ్ల కోర్సులకు గాను గరిష్టంగా 800 మంది విద్యార్థులు ప్రవేశం పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం కళాశాలలో ఉన్న 208 మంది విద్యార్థులకే సరిపడా వసతులు లేక నానా అవస్థలు పడుతుండగా.. రాబోయే విద్యా సంవత్సరానికి విద్యార్థుల సంఖ్య పెరిగితే గురుకులంలో వసతుల కల్పన సాధ్యతరం కాక కళాశాల నిర్వహణ మరింత కష్టమవుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్న వసతులను మెరుగుపరిచి శాశ్వత ప్రాతిపాదికన కళాశాల సామర్థ్యానికి సరిపడా తరగతి, వసతి గదులకు అవసరమైన భవనాలను తప్పనిసరిగా నిర్మించాల్సిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. సరియైన వసతులు, మౌలిక సదుపాయాలు కల్పించని పరిస్థితిలో కళాశాలలో ప్రవేశానికి గిరిజన విద్యార్థులు ముందుకొచ్చే పరిస్థితి కనపడటం లేదు.
లైబ్రరీ, ల్యాబ్ బహుదూరం
ఒకపక్క తరగతులు, డార్మెటరీని ఒకే గదిలో నిర్వహిస్తుండగా.. లైబ్రరీ, ల్యాబ్ తరగతి గదులు కళాశాలకు సుమారు 500 మీటర్ల దూరంలో ఉన్న ఒక అడ్మినిస్ట్రేటివ్ భవనంలో ఉన్నాయి. లైబ్రరీకి వెళ్లి తమకు అవసరమైన పాఠ్యాంశాలకు సంబంధించిన పుస్తకాలను చదవాలన్నా, ప్రాక్టికల్ తరగతుల కోసం ల్యాబ్‌లకు వెళ్లాలంటే రానుపోను సుమారుగా ఒక కిలోమీటర్ దూరం నడవాల్సి వస్తోంది. ఈ రాకపోకల సమయంలో మహిళ విద్యార్థుల రక్షణ ప్రశ్నార్థకంగా మారింది.
అంకంపాలెంలో నిర్వహిస్తున్న గిరిజన సంక్షేమ గురుకుల బాలికల డిగ్రీ కళాశాలలో విద్యార్థుల సంఖ్యకు సరిపడా తరగతి, డార్మెటరీ (వసతి) గదులు లేవు. ఈ కారణంగా తరగతి గదులనే బోధన అనంతరం వసతి గదుల మాదిరిగా వినియోగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాక లైబ్రరీ, ప్రాక్టికల్స్ తరగతులు నిర్వహించే ల్యాబ్ కళాశాల కాంపౌండ్‌లో లేకపోవడంతో సుమారు 500 మీటర్ల దూరంలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ భవనం వరకు విద్యార్థినులు కాలినడకన వెళ్లాల్సి వస్తోంది. ఈ అరకొర వసతులతోనే సరిపెట్టుకుంటున్న విద్యార్థినుల సంఖ్య రాబోయే విద్యా సంవత్సరానికి పెరిగితే భవిష్యత్‌లో కాలేజీ నిర్వహణ చాలా కష్టంగా మారే అవకాశం ఉంది.
అంకంపాలెం బాలికల డిగ్రీ కళాశాలలో విద్యార్థినులకు అన్ని రకాల వసతులు, మౌలిక సదుపాయాలు కల్పించాలి. అంతేకాక విద్యార్థుల గరిష్ట సంఖ్యకు సరిపడా భవనాలను నిర్మించే దిశగా ఐటీడీఏ అధికారులు చర్యలు చేపట్టాలి. దీనిపై స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ జోక్యం చేసుకొని ప్రస్తుతం విద్యార్థినులకు మెరుగైన వసతులు కల్పించేలా కృషి చేయాలి. – పాశం వెంకటేశ్వరరావు,
ఆదివాసీ నాయకుడు, దమ్మపేట
అంకంపాలెం గ్రామంలో ఇప్పటికే కళాశాల భనవ సముదాయం కోసం ఐదెకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారు. అదనపు తరగతి గదుల నిమిత్తం రూ.45 లక్షలు మంజూరయ్యాయి. విద్యార్థుల గరిష్ట సంఖ్యకు సరిపడా త్వరలోనే అన్ని రకాల మౌలిక సదుపాయాలతో నూతన భవనాలను నిర్మించే దిశగా ఉన్నతాధికారులు తగిన ప్రణాళికలను రూపొందిస్తున్నారు.
– బి.అరుణ కుమారి, ఐటీడీఏ, ఆర్‌సీఓ
అంకంపాలెం గురుకులంలో వసతులు కరువు
చదువు, నిద్ర ఒకేచోట..
చదువు, నిద్ర ఒకేచోట..


