‘ఎర్రమట్టి’ అమ్మేశారు..
ప్లాంటేషన్ నీటి కుంట వద్ద
జేసీబీతో తవ్వకాలు
రాత్రికి రాత్రే టిప్పర్ల ద్వారా రవాణా
అటవీ అధికారుల అండతోనే దందా
ఓ బడా కాంట్రాక్టర్ అనుచరులే
సూత్రధారులు
అశ్వారావుపేటరూరల్: రిజర్వ్ ఫారెస్టులో రాత్రికి రాత్రే జేసీబీతో తవ్వకాలు చేసి విలువైన ఎర్రమట్టిను టిప్పర్లలో అక్రమంగా తరలించారు. కొంతమంది అటవీ శాఖ ఉద్యోగుల సహకారంతోనే మట్టి తవ్వకాలు యఽథేచ్ఛగా జరగ్గా, దీనిపై జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందడంతో ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. అశ్వారావుపేట ఫారెస్టు రేంజ్‌లోని అశ్వారావుపేట సెక్షన్ పాపిడిగూడెం బీట్ పరిధిలోని కంపార్ట్‌మెంట్ నంబరు 292(పాపిడిగూడెం మార్గం)లో ‘కంపా’పథకం కింద అటవీశాఖ వివిధ రకాల మారుజాత మొక్కలను 25 హెక్టర్లలో పెంచుతున్నారు. ఈ ప్లాంటేషన్ ప్రధాన రహదారికి పక్కనే ఉండగా.. రహదారి నుంచి సుమారు రెండు కిలోమీటర్ల లోపల అటవీ జంతువుల దాహార్తిని తీర్చేందుకు నీటి కుంటను ఏర్పాటు చేశారు. కాగా, ఈ నీటి కుంటే తాజాగా ఎర్రమట్టి దందాకు కేంద్రంగా మారింది.
అటవీ అధికారుల అండతో..
దట్టమైన రిజర్వ్ ఫారెస్టులో ఉన్న ఈ నీటికుంటలో గురు, శుక్రవారం రాత్రుల్లో అశ్వారావుపేట రహదారి విస్తరణ పనులు చేస్తున్న ఓ కాంట్రాక్టర్ అనుచరులు ఎలాంటి అనుమతులు లేకుండా జేసీబీలతో తవ్వకాలు చేసి ఎర్రమట్టిని తరలించారు. నాలుగు టిప్పర్ల సాయంతో రాత్రంతా తరలించారంటే దందా ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. నాలుగు టిప్పర్లతో తరలించి ఎర్రమట్టి విలువ మార్కెట్ ధర ప్రకారం చేస్తే లక్షలాది రూపాయలు ఉంటుందని, ఈ అక్రమ మట్టి రవాణా అంతా కొంతమంది అటవీ ఉద్యోగుల సహకారం లేకుండా సాధ్యం కాదని స్థానికులు చెబుతున్నారు. అటవీ ప్రాంతంలో సామాన్యులు వంట చెరుకు, అవసరాలకు చిన్నపాటి చెట్టును నరికితే కేసులు, జరిమానాలు విధించే అటవీ అధికారులకు రెండు రోజులపాటు రిజర్వ్ ఫారెస్టులో జరిగిన ఈ మట్టి అక్రమ తవ్వకాలు, రవాణా కనిపించలేదా..? అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. కాగా, రిజర్వ్ ఫారెస్టులో ఇష్టారాజ్యంగా సాగిన మట్టి తవ్వకాలు, అక్రమ రవాణా వ్యవహారంపై కొంతమంది స్థానికులు జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. రిజర్వ్ ఫారెస్టులో ఎర్ర మట్టి తవ్వకాలు, అక్రమ రవాణాకు ఎంతమేర నగదు చేతులు మారిందనే విషయాలు విచారణలోనే తెలాల్సి ఉంది. కాగా, ఈ దందాకు సహకరించిన ఉద్యోగుల్లో కలవరం మొదలైంది.
కప్పిపుచ్చుకునేందుకు యత్నం..
కాగా, ఎర్రమట్టి కోసం జేసీబీలతో రిజర్వ్ ఫారెస్టు మధ్యలో ఉన్న నీటి కుంటలో భారీగా తవ్వకాలకు పాల్పడిన అక్రమార్కులు వాటిని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించారు. నీటికుంటలో మట్టి తవ్వకాలతో ఏర్పడిన భారీ గుంతలు ఖాళీగా ఉంటే దందా వెలుగులోకి రాకుండా ఉండేందుకు, ఆయా ఖాళీ గుంతలు కనిపించకుండా కుంట ఎగువ భాగంలో నిల్వ ఉన్న నీళ్లను కాలువ తీసి తాజాగా తవ్వకాలు చేసిన ఆయా గుంతల్లోకి వదిలారు. దీంతో మట్టి తవ్వకాలతో ఏర్పడిన భారీ గుంతలు నీళ్లతో నిండిపోయాయి. కాగా, ఈ అక్రమ మట్టి తవ్వకాల విషయం వెలుగులోకి వస్తే నీటి కుంటలో చేసిన తవ్వకాలు, గుంతలు కనిపించకుండా ఉండేలా అక్రమార్కులు జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. దీనిపై స్థానిక ఫారెస్టు రేంజర్ మురళిని వివరణ కోసం ‘సాక్షి’పలుమార్లు ఫోన్ చేయగా ఆయన స్పందించలేదు.
రిజర్వ్ ఫారెస్టులో వెలుగుచూసిన అక్రమ మట్టి దందా
‘ఎర్రమట్టి’ అమ్మేశారు..


