‘ఎస్టీ’ నుంచి లంబాడాలను తొలగించాల్సిందే..
ఖమ్మంమామిళ్లగూడెం: ఎస్టీ జాబితా నుంచి వలస లంబాడాలను తొలగించడమే లక్ష్యంగా విస్తృత ఉద్యమాలు నిర్వహించనున్నట్లు ఆదివాసీ 9 తెగల కార్యాచరణ సమితి చైర్మన్ చుంచు రామకృష్ణ పేర్కొన్నారు. ఆదివారం ఖమ్మంలోని జేఏసీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా ఈ నెల 15న చలో అచ్చంపేట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 23న మహబూబాబాద్ జిల్లా గుంజేడులో, 30న ఇల్లెందులో, డిసెంబర్ 4న చిరుమళ్లలో సన్నాహక సభలు, డిసెంబర్ 9న ఆసిఫాబాద్‌లో బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. అనంతరం చలో అచ్చంపేట, బొగ్గుట్ట, చిరుమళ్ల వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మైపతి అరుణ్‌కుమార్, పలు సంఘాల అధ్యక్షులు, నాయకులు కల్తీ వీరమల్లు, కొట్నాక విజయ్, సిద్ధబోయిన లక్ష్మీనారాయణ, పూసం వెంకటలక్ష్మి, కురసం పద్మజ, వెంకటేశ్వర్లు, శ్రీను, సీతారాములు, భాస్కరరావు, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.


