
ఇదేమి దారిద్య్రం?
అడ్డుకుంటున్న బాధితులు
సామర్థ్యానికి మించిన బరువుతో
పూడికతీత పేరుతో జిల్లాలో 20 రీచ్‌ల ఏర్పాటు
గోదావరి తీరం నుంచి జోరుగా సాగుతున్న రవాణా
భారీ వాహ నాలతో పాడవుతున్న పీఆర్, ఆర్‌అండ్‌బీ రోడ్లు
ప్రజల ఇబ్బందులు పట్టించుకోని టీజీఎండీసీ అధికారులు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: గోదావరి నదీ గర్భం నుంచి కోట్లాది క్యూబిక్ మీటర్ల ఇసుకను అమ్మడంపై ఉన్న శ్రద్ధ, ఆ ఇసుకను తరలించేందుకు అనుసరించాల్సిన విధానంపై లేకపోవడం ఏజెన్సీ వాసులకు కష్టాలు తెచ్చి పెట్టింది. నదీతీర ప్రాంతంలో నివాసమనేది దైన్యంగా మారింది.
ఇసుక తోడేస్తున్నారు
నిర్మాణమే జరగని సీతమ్మ సాగర్ బరాజ్ ఎగువ భాగంలో పూడిక తీత పేరుతో 2.20 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుకను తవ్వి తీసేందుకు తెలంగాణ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీజీఎండీసీ) అనుమతులు జారీ చేసింది. ఈ ఇసుకను తరలించేందుకు చర్ల, అశ్వాపురం, మణుగూరు, పినపాక, దుమ్ముగూడెం మండలాల పరిధిలో 20 ఇసుక రీచ్‌లను గుర్తించింది. ఈ మేరకు టెండర్ల ప్రక్రియ కూడా చకచకా జరిగిపోయింది. ఇసుక తవ్వకాలు కూడా జరుగుతున్నాయి. ఇక్కడ ఇసుక అమ్మడం ద్వారా రాష్ట్ర ఖజానాకు రూ. 2,000 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుందని అంచనా. అమ్మకాల వ్యవహారం మొత్తం పర్యవేక్షిస్తున్న టీజీఎండీసీ అధికారుల నిర్లక్ష్యం జిల్లా వాసులకు కష్టాలు తెచ్చి పెట్టింది. ఇసుక తరలించేందుకు వీలుగా రోడ్లను అభివృద్ధి చేయకుండానే అమ్మకాలు మొదలు పెట్టడంతో జిల్లాలోని రోడ్లన్నీ ఛిద్రమవుతున్నాయి.
రోడ్ల సామర్థ్యం ఇలా..
గ్రామాలను కలిపే పంచాయతీరాజ్ రోడ్ల నిర్మాణంలో ముందుగా అడుగు మందంతో కంకర వేస్తారు. ఆ తర్వాత 30 ఎంఎం మందంతో బీటీ వేస్తారు. రోజుకు రెండు వందల వాహనాలు తిరగడం, 40 టన్నుల బరువు తట్టుకునే సామర్థ్యంతో ఈ రోడ్లను నిర్మిస్తారు. ఆర్‌అండ్‌బీ రోడ్ల విషయంలో ఒకటిన్నర అడుగు వంతున కంకర వేస్తారు. ఆ తర్వాత 30 ఎంఎం, 50 ఎంఎం వంతున బీటీ వేస్తారు. ఈ రోడ్లు పరిమిత సంఖ్యలో హెవీ వెహికల్స్ తిరిగేందుకు అనువుగా ఉంటాయి. ఇక జాతీయ రహదారుల విషయానికి వస్తే కనీసం రెండు అడుగులకు తక్కువ కాకుండా కంకర వేస్తారు. ఆ తర్వాత 30 ఎంఎం ప్లస్ 30 ఎంఎం ప్లస్ 50 ఎంఎం వంతున బీటీ వేస్తారు. ఈ రోడ్లు అపరిమిత సంఖ్యలో భారీ వాహనాలు తిరిగేందుకు అనువుగా ఉంటాయి.
రోడ్లు విస్తరించరా?
జిల్లాలో సింగరేణి సంస్థ వందేళ్లకు పైగా మైనింగ్ చేస్తోంది. డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ కింద ఆ సంస్థ చెల్లించే రాయల్టీతో జిల్లా వ్యాప్తంగా అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇసుక అమ్మకాల ద్వారా టీజీఎండీసీకి వేలాది కోట్లు ఆదాయం వస్తున్నా కనీసం ఇసుక రవాణా చేసే రోడ్లను అభివృద్ధి చేయడం పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. కేవలం ఇసుక అమ్ముకోవడం, సొమ్ములు చేసుకోవడం మా పని, రోడ్లు ఎలా ఉంటే మాకేంటనే విధంగా టీజీఎండీసీ అధికారుల తీరు ఉంది.
ములుగు జిల్లాలో ఇసుక లారీల వల్ల రోడ్లు తీవ్రంగా పాడైపోవడంతో ఆ జిల్లా అధికారులు ఇసుక లారీల రాకపోకలపై ఆంక్షలు విధించారు. దీంతో ఇసుక లారీల ట్రాఫిక్‌ను భద్రాద్రి జిల్లా మీదుగా మళ్లించారు. ఇక్కడ కూడా అవే సమస్యలు వస్తున్నాయి. ఈ నెల ఆరంభంలో ఇసుక లారీల వల్ల చర్ల, మణుగూరు, దుమ్ముగూడెం మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇటీవల మణుగూరులో టీజీఎండీసీ ప్రాజెక్టు అధికారి శంకర్‌నాయక్‌ను బాధితులు నేరుగా ప్రశ్నించారు. చివరకు ఇసుక లారీలను అడ్డుకునేందుకు ఎక్కడిక్కడ ప్రజలు సిద్ధమయ్యారు. పరిస్థితి ముదురుపాకన పడుతుండటంతో వర్షాలను సాకుగా చూపుతూ పర్మిట్ల జారీని టీజీఎండీసీ తగ్గించింది. దీంతో గడిచిన నాలుగు రోజులుగా ఇసుక లారీల సందడి తగ్గింది.
ప్రస్తుతం గోదావరి తీరం నుంచి ఆర్‌అండ్‌బీ వరకు ఇసుక లారీలు తిరిగే రోడ్లన్నీ పంచాయతీరాజ్ ఆధీనంలో ఉన్నాయి. ఇవి భారీ వాహనాలు తిరిగేందుకు అనువుగా లేవు. ఇక గోదావరి తీరం వెంబడి ఉన్న చర్ల – భద్రాచలం, పినపాక – కృష్ణసాగర్ క్రాస్‌రోడ్ రోడ్లు ఆర్ అండ్ బీ పరిధిలో ఉన్నాయి. ఇవి కూడా పరిమిత సంఖ్యలో హెవీ వెహికల్స్ తిరిగేందుకు అనువైన రోడ్లు. ఇలాంటి రోడ్ల మీద కనీసం యాభై టన్నుల బరువు (35 టన్నుల ఇసుక , 15 టన్నుల బాడీ వెయిట్)తో లారీలు ప్రతీ రోజు వందల కొద్దీ తిరుగుతున్నాయి. దీంతో పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ రోడ్లు ధ్వంసమవుతున్నాయి. ఫలితంగా గ్రామీణ ప్రాంత ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇసుక వాహ నాలతో
రహదారులు ఛిద్రం

ఇదేమి దారిద్య్రం?