
పత్తి రైతుకు ‘కపాస్’ కష్టం
కొత్తగా కపాస్ కిసాన్ యాప్ తీసుకొచ్చిన సీసీఐ
యాప్‌లో రైతు స్లాట్ బుక్ చేస్తేనే కొనుగోళ్లు
స్మార్ట్ ఫోన్లపై కర్షకులకు అవగాహన లేమి
ఏజెన్సీ ప్రాంతాల్లో
అందని సెల్‌ఫోన్ సిగ్నల్స్
బూర్గంపాడు: పత్తి రైతును సీజన్ ప్రారంభం నుంచీ సమస్యలు వెంటాడుతున్నాయి. సకాలంలో వర్షాలు కురవక, ఆ తర్వాత అధిక వర్షాలు రావడంతో పంటలు దెబ్బతిన్నాయి. అన్నింటినీ అధిగమించి చేతికొచ్చిన అరకొర పంటను అమ్మాలంటే సీసీఐ తెచ్చిన కపాస్ యాప్ ఆందోళనకు గురిచేస్తోంది. పత్తి కొనుగోళ్లలో దళారుల ప్రమేయం నివారించేందుకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) కొత్తగా కపాస్ కిసాన్ యాప్‌ను తెచ్చింది. సీపీఐలో పత్తి విక్రయించాలంటే రైతులు తప్పనిసరిగా ఆండ్రాయిడ్ ఫోన్‌లో కపాస్ కిసాన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఫోన్ నంబర్ ఆధారంగా వచ్చే ఓటీపీతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫోన్, ఆధార్, పట్టాదారు పాసుపుస్తకాల నంబర్, భూముల సర్వే నంబర్, విస్తీర్ణం తదితర వివరాలను అప్‌లోడ్ చేసుకోవాలి. పంట విక్రయించే సమయంలో స్లాట్ బుక్ చేసుకోవాలి. ఎన్ని క్వింటాళ్ల పత్తి అమ్మకానికి తెస్తున్నారు, తేమశాతం ఎంత? తదితర వివరాలు నమోదు చేయాలి. ఆ తర్వాత స్థానిక వ్యవసాయ అధికారులు ఎప్పుడు, ఎక్కడకు తీసుకురావాలనే వివరాలను స్లాట్‌లోనే వెల్లడిస్తారు.
రైతుల్లో ఆందోళన
కపాస్ యాప్ విధానం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. చాలామంది రైతులకు ఆండ్రాయిడ్ ఫోన్లు లేవు. ఉన్నా ఆ ఫోన్ నంబర్, పట్టాదారు పాసు పుస్తకంతో లింకై ఉండాలి. లేకుంటే యాప్‌లో రిజిస్ట్రేషన్ కాదు. ఆధార్‌కార్డుతో అయినా చాలావరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులువవుతుంది. కానీ కపాస్ కిసాన్ యాప్‌లో ఫోన్ నంబర్ కీలకంగా మారింది. పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చినప్పుడు ఏ ఫోన్ నంబర్ ఉందో అదే నంబర్‌తో యాప్‌ను రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. స్లాట్ బుక్ చేసుకున్నాక మూడుసార్లు కేటాయించిన తేదీల్లో పత్తి తీసుకురాకుంటే వారు ఆటోమేటిక్‌గా బ్లాక్ లిస్ట్‌లో చేరతారు.
ఏజెన్సీలో సిగ్నల్ సమస్య
జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాల్లోనే ఎక్కువగా పత్తి సాగు చేస్తున్నారు. వీరిలో చాలామందికి స్మార్ట్ ఫోన్ల వినియోగం తెలియదు. యాప్ డౌన్‌లోడ్, రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ వంటి ప్రక్రియలపై అవగాహన లేదు. కొందరికి ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగం తెలిసినా సిగ్నల్ సమస్య ఎదురవుతుంది. క్రాప్‌బుకింగ్ సమయంలో సిగ్నల్స్ అందక వ్యవసాయశాఖ అధికారులే ఇబ్బందులు పడుతున్నారు. గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో మండల కేంద్రాలు, మార్కోడు గ్రామానికి తప్ప మిగతా గ్రామాల్లో సిగ్నల్స్ పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండవు. కరకగూడెం, పినపాక, దుమ్ముగూడెం, చర్ల, బూర్గంపాడు మండలాల్లోని మారుమూల అటవీ గ్రామాల్లో కూడా సెల్‌ఫోన్ సిగ్నల్స్ సరిగా రావు. ఆయా గ్రామాల రైతులు చిన్న ఫోన్‌లనే వినియోగిస్తున్నారు. ఇప్పుడు పత్తి అమ్మకాలకు కపాస్ కిసాన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలంటే వారు స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేయాలి. స్మార్ట్ ఫోన్‌ను వినియోగించుకోవాలంటే సిగ్నల్స్ వచ్చే ప్రాంతాలకు రావాలి. ఇన్ని గందరగోళ పరిస్థితుల్లో సన్న, చిన్నకారు రైతులు మళ్లీ స్థానికంగా ఉన్న దళారులను, వ్యాపారులను ఆశ్రయించే అవకాశాలున్నాయి. ఇక కౌలురైతులు పత్తిని అమ్ముకోవాలంటే ముందుగా పట్టాదారు రైతు నంబర్‌తో యాప్‌లో లాగిన్ కావాలి. ఆ తర్వాత వ్యవసాయశాఖ అధికారులు కౌలు రైతు వివరాలను యాప్‌లో నమోదు చేసి పట్టాదారుకు అనుసంధానం చేస్తారు. ఈ ప్రక్రియలో కౌలు రైతుల కష్టాలు చెప్పనలవి కాదు.