
హింసించి చంపుతున్నారు..
కుక్కల కట్టడి పేరుతో హింస
సహకరిస్తున్న మున్సిపాలిటీలు.. పంచాయతీలు
అశ్వారావుపేట: స్థానిక పోలీస్‌స్టేషన్ సెంటర్‌లో మంగళవారం ఉదయం ఓ కుక్క మరణాన్ని చూసిన వారికి ‘కుక్క చావు’అంటే ఇలా ఉంటుందా? అని అనిపించకమానదు. బైండింగ్ వైర్‌తో ఉచ్చు వేసి, ఆహార పదార్థం అమర్చి, కుక్క నోటితో పట్టుకోగానే ఉచ్చును బిగించారు. తర్వాత బిగుసుకుపోయిన కుక్కను వ్యాన్‌లోకి విసిరే క్రమంలో పలుమార్లు వ్యాన్‌డోర్‌కు తగిలి కింద పడి విలవిల్లాడుతూ చనిపోయిన ఆ జీవులను చూసి పలువురు అయ్యో పాపం అనుకున్నారు తప్ప చేసేదేమీ లేకుండా పోయింది. సాధారణంగా అడవిలో వణ్యమృగాలను వేటాడేందుకు వేట కుక్కలుంటాయి. మేకల కాపరులు, వేటగాళ్లు ఈ వేటకుక్కలను పెంచుతుంటారు. కానీ, అశ్వారావుపేటలో కుక్కలను వేటాడే వేటగాళ్లొచ్చి పడ్డారని ప్రజలు అనుకుంటున్నారు.
ఎందుకిదంత..?
ఒక్కో కుక్కను పట్టుకున్నందుకు ప్రాంతాన్ని బట్టి అవసరాన్ని బట్టి ధర నిర్ణయిస్తారు. గతంలో ఒక్కో కుక్కకు రూ.500 చెల్లించి పట్టించారు. ఒక పంచాయతీలో పట్టకున్న కుక్కలను దూరంగా మరో పంచాయతీ సరిహద్దులో వదిలేస్తారు. మళ్లీ ఇదే పట్టుబడి ముఠాకు చెందిన మరో బృందం పక్కనున్న పంచాయతీలో ఇవే కుక్కలను పట్టుకుంటుంటారు. ఈ క్రమంలో వారం క్రితం ఇతర ప్రాంతం నుంచి అశ్వారావుపేటకు తెచ్చి కొన్ని కుక్కలను, కోతులను విడిచిపెడుతుంటే స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అశ్వారావుపేటలో రాజమండ్రికి చెందిన కొందరు వేటగాళ్లు కుక్కలను వేటాడుతున్నారు. కానీ, జనావాసాల్లో కుక్కలను నియంత్రించాలంటే ముందుగా వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయాలి తప్ప ఎలాంటి హింసకు గురిచేయొద్దని పలువురు చెబుతున్నారు. మున్సిపాలిటీ / పంచాయతీ ఖర్చుతో స్థానిక ప్రభుత్వ పశుసంవర్థక శాఖ వైద్యాధికారితో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించాలి.
ఆపరేషన్ అనంతరం చెవికి ట్యాగ్ తగిలించి ఎక్కడ పట్టుకున్నారో అదే స్థానంలో కుక్కను విడిచిపెట్టాలి. అంతేకానీ హింసించడం.. కిడ్నాప్ చేయడం.. అక్రమ రవాణా చేయడం తగదని జంతు ప్రేమికులు చెబుతున్నారు. కుక్కలతో స్థానికులకు ఇబ్బందులున్న మాట వాస్తవమే కానీ.. వాటినీ సాటి ప్రాణుల్లా చూస్తూ స్థానిక ప్రజానికాన్ని నిబంధనల ప్రకారం కాపాడాల్సిన అవసరం మున్సిపాలిటీ అధికారులపై ఉంది. ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్ బి.నాగరాజు దృష్టికి తీసుకువెళ్లగా.. కుక్కలను పట్టమని చెప్పాం తప్ప హింసించడం సరైన పద్ధతి కాదని చెప్పారు. కుక్కలను పట్టే ప్రక్రియను తాత్కాలికంగా ఉపసంహరిస్తామని, కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసేలా ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు.