రాష్ట్రంలో వివిధ ప్రాంతాల రైతులకు టోకరా
రెవెన్యూ మంత్రికి అందిన ఫిర్యాదుతో కదిలిన డొంక
ఐదుగురితో కూడిన ముఠా అరెస్ట్
వివాదాస్పద భూములతో పాటు వివిధ కారణాలతో పట్టాదారు పాస్ పుస్తకాలు లేక ఇబ్బంది పడుతున్న రైతులను గుర్తించి ఈ ముఠా సంప్రదించడం మొదలుపెట్టింది. వీరికి పాసు పుస్తకాలు ఇప్పిస్తామని నమ్మించి రూ.లక్షల చొప్పున మొత్తం రూ.కోట్లలో వసూలు చేశారు. భూముల ధర రూ.లక్షల్లో ఉండడంతో రైతులు కూడా ముఠా అడిగినంత డబ్బు ముట్టజెప్పారు. కూసుమంచి మండలంతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ముఠా సభ్యులు ఎవరికి వారు తమకు పరిచయం ఉన్న రైతుల నుంచి డబ్బు లాగేశారు. డబ్బు తీసుకుని ముఖం చాటేయడంతో రైతుల నుంచి ఒత్తిడి ఎదురైంది. దీంతో నకిలీ పుస్తకాల తయారీకి శ్రీకారం చుట్టారు. ప్రింటింగ్ ప్రెస్‌లో పుస్తకాలు తయారుచేసి, కలర్ ప్రింటర్ సాయంతో రైతుల ఫొటోలు, పేర్లు ముద్రించడమే కాక ప్రభుత్వ హాలోగ్రామ్ వేసి రైతులకు అప్పగించారు.
కూసుమంచి: సమస్యల్లో ఉన్న భూములకు పట్టాదారు పాస్‌పుస్తకాలు ఇప్పిస్తామంటూ రూ.లక్షల మేర వసూలు చేసి నకిలీ పుస్తకాలు అంటగట్టిన ముఠా వ్యవహారం బట్టబయలైంది. ఖమ్మం జిల్లా కూసుమంచి పోలీసులు చేపట్టిన దర్యాప్తులో ముఠాకు చెందిన ఐదుగురిని అరెస్ట్ చేసి 10 నకిలీ పట్టాదారు పాస్‌పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. వీరి చేతిలో రాష్ట్రంలోని నల్లగొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, సంగారెడ్డి ప్రాంతాల రైతులు మోసపోగా.. బాధితుల లెక్క తేలాల్సి ఉంది.
ఆన్‌లైన్‌లో లేకపోవడంతో...
కూసుమంచి మండలం జక్కేపల్లి గ్రామానికి చెందిన కళ్లెం అంజిరెడ్డిని అదే గ్రామానికి చెందిన, ముఠాలో ఒకరైన కొత్తా జీవన్‌రెడ్డి సంప్రదించాడు. మూడెకరాల భూమికి తనకు తెలిసిన వారి ద్వారా పట్టాదారు పాస్‌పుస్తకం ఇప్పిస్తానంటూ రూ.13 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అంజిరెడ్డి విడతల వారీగా రూ.5లక్షలు చెల్లించినా పాసుపుస్తకం ఇవ్వకపోగా మిగిలిన డబ్బు కావాలని ఒత్తిడి చేస్తుండడంతో అనుమానించాడు. ఆపై వాట్సప్‌లో ఓ పాస్‌పుస్తకం పంపించాడు. ఆ నంబర్ ఆధారంగా ఆన్‌లైన్‌లో పరిశీలిస్తే లేకపోవడంతో అనుమానం బలపడగా అంజిరెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఫిర్యాదు చేశారు. దీంతో తీవ్రంగా పరిగణించిన ఆయన సమగ్ర విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించారు. దీంతో ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి ఆధ్వర్యాన సీఐ సంజీవ్, ఎస్సై నాగరాజు రంగంలోకి దిగారు. ఈక్రమాన రెండు కార్లలో బుధవారం ఉదయం జీవన్‌రెడ్డితో పాటు మహబూబాబాద్ జిల్లా గార్ల బయ్యారానికి చెందిన కొండూరి కార్తీక్(ప్రస్తుతం ఖమ్మంలో నివాసం), భద్రాద్రి జిల్లా పాల్వంచకు చెందిన పారిపత్తి సాయికుశల్, లక్ష్మీదేవిపల్లికి చెందిన జక్కపల్లి వరప్రసాద్, ఖమ్మం బొక్కలగడ్డకు చెందిన నందమూరి లక్ష్మణ్‌రావు(ప్రస్తుతం సారపాకలో నివాసం) వెళ్తుండగా అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దీంతోనకిలీ పాస్‌పుస్తకాలు తయారు చేస్తున్నట్లు ఒప్పుకోగా 10 పాస్ పుస్తకాలను, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఒకరైన లక్ష్మణ్ తన ప్రింటింగ్ ప్రెస్‌లోనే పాస్‌పుస్తకాలు తయారుచేసినట్లు అంగీకరించారని కూసుమంచి ఎస్సై నాగరాజు తెలిపారు. ఈ ముఠా చేతిలో ఎందరు రైతులు మోసపోయారో తేల్చేందుకు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.