
కుండపోత వర్షం.. పోటెత్తిన వరద
● దమ్మపేట, అశ్వారావుపేట, మణుగూరులలో భారీ వర్షం ● లోతట్టు ప్రాంతాల్లోని జనావాసాల్లోకి చేరిన వర్షపునీరు ● పలుచోట్ల రహదారులు మునిగి రాకపోకలకు అంతరాయం
అశ్వారావుపేటరూరల్/దమ్మపేట/మణుగూరుటౌన్: జిల్లాలో శనివారం పలుచోట్ల ఓ మోస్తరు నుంచి భారీవర్షం కురిసింది. అశ్వారావుపేట, దమ్మపేట, మణుగూరు మండలాల్లో కుండపోత వాన పడింది. చెరువులు, నీటి కుంటలు నిండి వాగులు, కాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు చోట్ల వరద నీరు రోడ్డుపై ప్రవహించడంతో గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి, దుకాణాల్లోకి వరద నీరు చేరుకుంది. దమ్మపేట ప్రధాన రహదారిని వరద నీరు ముంచెత్తగా, వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. అశ్వారావుపేట మండలంలోని మల్లాయిగూడెం గ్రామాన్ని వరద పోటెత్తింది. గ్రామంలోని ప్రధాన, అంతర్గత రోడ్లు జలమయంగా మారాయి. వాగొడ్డుగూడెం–అశ్వారావుపేట మార్గంలోని లోలెవల్ చప్టా మునిగిపోయింది. మద్దికొండ–కేశప్పగూడెం మధ్యలో వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. అనంతారం, నారాయణపురం, ఖమ్మంపాడు ప్రాంతాల్లో పెదవాగు ఉధృతంగా ప్రహిస్తోంది. కుండపోత వర్షంతో కట్టువాగు, మొట్లవాగు ఉధృతంగా ప్రవహించగా మణుగూరు పట్టణంలోని ప్రధాన రహదారిపై వర్షపు నీరు నిలిచింది. దీంతో సురక్షా బస్టాండ్ వద్ద ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ వరద నీటి మళ్లింపు చర్యలు చేపట్టారు. సీఐ నాగబాబు, ఎస్‌ఐ రంజిత్ ట్రాఫిక్‌ను మళ్లించారు. సింగరేణి ఓసీ–4 గనిలో బొగ్గు, ఓబీ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు.

కుండపోత వర్షం.. పోటెత్తిన వరద