
కొత్త రైళ్ల జాడేది..?
బెళగావి రద్దుతో ఐటీ ఉద్యోగులకు ఇక్కట్లు
డోర్నకల్, కాజీపేట రైళ్ల రద్దుకు
ఐదేళ్లు పూర్తి
బుట్టదాఖలవుతున్న
తిరుపతి, షిర్డీ ప్రతిపాదనలు
తొమ్మిది నెలలుగా నడవని బెళగావి
జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర రాజధానికి చేరుకునేందుకు ఉదయం వేళ కాకతీయ, రాత్రి సమయంలో సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు కరోనాకు ముందు మణుగూరు నుంచి కొల్హాపూర్ వరకు రైలు నడిచింది. రోజూ సాయంత్రం 5 గంటల సమయంలో బయల్దేరి వెళ్లేది. సికింద్రాబాద్ – బేగంపేట – లింగంపల్లిల మీదుగా కొల్హాపూర్ వరకు నడవడంతో ఎంతోమందికి ఉపయోగకరంగా ఉండేది. పశ్చిమ హైదరాబాద్‌లో నివసిస్తున్న ఐటీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు సౌకర్యంగా ఉండేది. కరోనా సమయంలో ఈ రైలును రద్దు చేశారు. ఆ రైలు స్థానంలో 2022లో మణుగూరు – బెళగావి రైలు అందుబాటులోకి వచ్చింది. విజయవాడ–కాజీపేట మార్గంలో జరుగుతున్న మూడో లైను నిర్మాణ పనుల కారణంగా బెళగావిని ప్రతీ మూడు నాలుగు నెలలకోసారి రద్దుచేసేవారు. చివరగా 2024 డిసెంబరు 18న రైలును రద్దు చేయగా, ఆ తర్వాత మళ్లీ రైలును ప్రారంభించే అంశంపై రైల్వేశాఖ పెదవి విప్పడం లేదు. మరోవైపు మూడో లైను నిర్మాణ పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయి.
సాయంత్రం రైళ్లేవి
జిల్లా కేంద్రం నుంచి ఉదయం 5 గంటలకు కాకతీయ, 6 గంటలకు సింగరేణి, మధ్యాహ్నం 1:45 గంటలకు విజయవాడ ప్యాసింజర్ రైళ్లు నడుస్తున్నాయి. రాత్రి వేళ 10:45 గంటలకు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఉంది. సాయంత్రం సమయంలో ఒక్కరైలు కూడా అందుబాటులో లేదు. గతంలో బెళగావి ట్రైన్ అందుబాటులో ఉండేది. వివిధ పనుల మీద కొత్తగూడెం వచ్చే సింగరేణి కార్మికులు సైతం ఈ రైలు ద్వారా వరంగల్/కాజీపేటకు చేరుకుని అక్కడి నుంచి మరోరైలు ద్వారా మంచిర్యాల, రామగుండం, బెల్లంపల్లి వంటి ప్రాంతాలకు వెళ్లేవారు. బెళగావిని తిరిగి ప్రారంభించకపోవడంతో ఇటు హైదరాబాద్, అటు కోల్‌బెల్ట్ ఏరియాలకు వెళ్లే ప్రయాణికులకు ఇక్కట్లు తప్పడం లేదు. కరోనాకు ముందు నడిచిన మణుగూరు–కాజీపేట ప్యాసింజర్ రైలు పగటి వేళ వరంగల్ – కొత్తగూడెం మధ్య రాకపోకలు సాగించేవారికి ఉపయుక్తంగా ఉండేది. ఐదేళ్ల క్రితం దీన్ని రద్దు చేసిన రైల్వే శాఖ తిరిగి ప్రారంభించే ఊసే ఎత్తడం లేదు. డోర్నకల్ – భద్రాచలంరోడ్ ప్యాసింజర్‌ది ఇదే పరిస్థితి.
డిమాండ్లకే పరిమితం
భద్రాచలంరోడ్ – పెద్దపల్లి– నిజామాబాద్ మీదుగా షిరిడీకి రైలు నడిపించాలనే డిమాండ్‌తో ఇచ్చిన వందలాది అర్జీలు బుట్టదాఖలవుతున్నాయి. భద్రాచలంరోడ్/మణుగూరుల నుంచి తిరుపతి వరకు రైలు నడిపించాలనే డిమాండ్ సైతం ఏళ్ల తరబడి అమలుకు నోచుకోవడం లేదు. కనీసం డోర్నకల్ మీదుగా ఈ రెండు పుణ్యక్షేత్రాలకు వెళ్లే రైళ్లకు భద్రాచలంరోడ్/మణుగూరుల నుంచి కనీసం ఐదారు స్లీపర్ కోచ్‌లను పంపే అంశాన్ని కూడా రైల్వేశాఖ పట్టించుకోవడం లేదు. దసరా, సంక్రాంతి, వేసవి సెలవుల సందర్భంగా వందలాది ప్రత్యేక ట్రైన్స్‌ను ప్రకటించే రైల్వేశాఖ ఏర్పాటు చేస్తున్నా అందులో ఒక్కటి కూడా జిల్లాకు కేటాయించడం లేదు. ఆఖరికి ముక్కోటి, శ్రీరామనవమి వంటి పర్వదినాలప్పుడు భద్రాచలం పుణ్యక్షేత్రానికి కూడా రైళ్లను నడిపించడంపై కొన్నేళ్లుగా మీనమేషాలు లెక్కిస్తూ వస్తోంది.
సింగరేణి బొగ్గు రవాణా చేసేందుకు రోజూ జిల్లా మీదుగా 14కు తగ్గకుండా మాల్‌గాడీలు (గూడ్సు రైళ్లు) నడుస్తున్నాయి. తద్వారా కోట్లాది రూపాయల ఆదాయం రైల్వేకు దక్కుతోంది. ఇదే సమయంలో మాల్‌గాడీల్లో కనీసం సగం సంఖ్యలో అయినా ఇక్కడి ప్రజల అవసరాలకు తగినట్లు రైళ్లను నడిపించడం లేదు. రైల్వేశాఖ మొక్కుబడిగా నాలుగు రైళ్లతోనే నాలుగైదేళ్లుగా సరిపెడుతోంది. ఈ అంశంపై ఖమ్మం,
మహబూబాబాద్ ఎంపీలు రామసహాయం రఘురాంరెడ్డి, పోరిక బలరాంనాయక్‌లు దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.
–సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం
రద్దయిన బండ్లను
పునఃప్రారంభించని రైల్వే శాఖ