భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలోని మూలమూర్తులు శుక్రవారం స్వర్ణకవచధారులై దర్శనమిచ్చారు. తొలుత తెల్ల వారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజ లు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విష్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారి కి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారి కి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపా రు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. శుక్రవారం సందర్భంగా లక్ష్మీతాయారు అమ్మవారికి అభిషేకం, ప్రత్యక పూజలు చేశారు.
పెద్దమ్మతల్లికి
పంచామృతాభిషేకం
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి శుక్రవారం వైభవంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో శుక్రవారం అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్‌కు పంచామృతంతో అభిషేకం పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలతోపాటు కుంకుమపూజ, గణపతిహోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈఓ రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు పాల్గొన్నారు.
జూలూరుపాడు
మార్కెట్‌కు రూ.3 కోట్లు
జూలూరుపాడు: జూలూరుపాడు వ్యవసాయ మార్కెట్ నిర్మాణానికి రూ.3.03 కోట్లు మంజూరు చేసినట్లు రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ అడిషనల్ డైరెక్టర్ రవికుమార్ తెలిపారు. శుక్రవారం మార్కెటింగ్ శాఖ వరంగల్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్‌తో కలిసి ఆయన జూలూరుపాడు శాశ్వత వ్యవసాయ మార్కెట్ నిర్మాణానికి కేటా యించిన ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఈనెల 25న టెండర్ ప్రక్రియ జరుగుతుందని, అనంతరం మార్కెట్ నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీఎంఓ నరేందర్, ఏన్కూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి బజారు, సిబ్బంది పాల్గొన్నారు.
15న సైన్స్ సెమినార్
కొత్తగూడెంఅర్బన్: ఈ నెల 15న జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ‘క్వాంటం ఏజ్ బిగిన్స్ పొటెన్షియల్స్ – చాలెంజెస్‘అనే అంశంపై జిల్లా విద్యాశిక్షణా కేంద్రంలో సెమినార్ నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి బి.నాగలక్ష్మి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల నుంచి 8 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు సెమినార్‌లో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. ప్రతీ పాఠశాల నుంచి ఒక్కరు లేదా ఇద్దరు విద్యార్థులకు మాత్రమే అవకాశం ఉంటుందని తెలిపారు. గరిష్టంగా ఐదు చార్టులు, పవర్ పాయింట్‌కు సంబంధించి ఐదు స్లైడ్‌లు ప్రదర్శించవచ్చని, పోటీలో పాల్గొనే విద్యార్థులు వివరాలను నమోదు చేసుకోవాలని వివరించారు. ఇతర వివరాలకు జిల్లా విద్యాశాఖ అకాడమిక్ మానిటరింగ్ అధికారి ఏ.నాగరాజ శేఖర్‌ను సంప్రదించాలని కోరారు.
కిన్నెరసాని నుంచి
నీటి విడుదల
పాల్వంచరూరల్: ఎగువన కురుస్తున్న వర్షాలకు కిన్నెరసాని జలాశయంలోకి వరద ఉధృతి కొనసాగుతోంది. 407 అడుగుల నీటినిల్వ సామర్థ్యం కలిగిన కిన్నెరసాని రిజర్వాయర్‌లోకి ఎగువ నుంచి 1600 క్యూసెక్కుల వరదనీరు రావడంతో శుక్రవారం నీటిమట్టం 405.20 అడుగులకు పెరిగింది. దీంతో ప్రాజెక్ట్‌కు చెందిన ఒక గేటును ఎత్తి ఉంచి 3 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నట్లు ఏఈ తెలిపారు.
స్వర్ణ కవచధారణలో రామయ్య
స్వర్ణ కవచధారణలో రామయ్య