
రైతులకు తప్పని యూరియా వెతలు
ఇల్లెందు/పాల్వంచరూరల్: రైతులకు యూరియా వెతలు తీరడంలేదు. పంపిణీ కేంద్రాల వద్ద తెల్లవారుజామునుంచే బారులుదీరుతున్నారు. గు రువారం వరకు పాల్వంచ పట్టణంలోని సహకార సొసైటీ కార్యాలయంలో అధికారులు యూరి యా పంపిణీ చేశారు. శుక్రవారం జగన్నాథపురం రైతువేదికలో పంపిణీ చేపట్టారు. దీంతో జగన్నాథపురం, కేశవాపురం, సోములగూడెం, తోగ్గూడెం, నాగారం, రంగాపురం, దంతలబోరు, బండ్రుగొండ, సంగం తదితర గిరిజన గ్రామాల రైతులు తరలివచ్చారు. దీంతో రైతువేదిక నిండిపోయింది. 320 మంది రైతులు తమ పేర్లను రిజిస్టర్ చేసుకోగా, 220మంది రైతులకే యూరియా పంపిణీ చేశారు. రిజిస్ట్రేషన్ చేసుకున్నా ఇంకా 100 మందికి యూరి యా దొరకలేదు. మిగిలిన రైతులకు సోమవారం లోడ్ వస్తే పంపిణీచేస్తామని ఏఓ శంకర్ తెలిపారు. ఇక ఇల్లెందులోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రం వద్దకు రొంపేడు, మసివాగు, ముత్తారపుకట్ట తదితర గ్రామాల నుంచి తెల్లారేసరికే రైతులు చేరుకున్నారు. రోజంతా క్యూలైన్‌లో నిలబడలేక చెప్పులు క్యూలో పెట్టి ఎదురుచూశారు. ఇల్లెందు, చల్లసముద్రం, సుదిమళ్ల, కొమరారం కేంద్రాలుగా యూరియా పంపిణీ కేంద్రాలు తెరిచి 1,860 మెట్రిక్ టన్నుల యూరియా ను సుమారు 10 వేల మంది రైతులకు పంపిణీ చేసినట్లు అధికారులు చెబుతున్నాయి. అయినా పంటలకు సరిపడా యూరియా అందక రైతులు గోస పడుతున్నారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ ఏడీఏ సుధాకర్, సొసైటీ కార్యదర్శి శ్రీనివాస్, సీఈఓ సత్యం, స్టాక్ అసిస్టెంట్ లక్ష్మి పాల్గొన్నారు.

రైతులకు తప్పని యూరియా వెతలు