
స్ట్రక్చరల్ సమావేశం బహిష్కరణ
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి యాజమాన్యం మొండివైఖరి వల్లే స్ట్రక్చరల్ సమావేశాన్ని బహిష్కరించినట్లు సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ( ఏఐటీయూసీ) అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ తెలిపారు. శుక్రవారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. ఏడాదికాలంలో మూడుసార్లు నిర్వహించిన సమావేశాల్లో అంగీకరించిన అంశాలపై యాజమాన్యం ఇప్పటివరకు సర్క్యులర్ జారీ చేయకుండా కాలయాపన చేస్తోందని ఆరోపించారు. సొంతింటి పథకంపై కమిటీ వేసినా ఇంతవరకు సమావేశం నిర్వహించలేదన్నారు. ఏసీబీ బూచి చూపి మెడికల్ బోర్డ్‌ను నిలిపివేయడం యాజమాన్య తప్పిదమేనని అన్నారు. గతంలోలాగే మెడికల్ బోర్డ్ నిర్వహించాలని కోరారు. కంపెనీ వాస్తవ లాభాలు ప్రకటించి, 35శాతం కార్మికులకు వాటాను చెల్లించాలన్నారు. ఈ సమావేశంలో నాయకులు మిరియాల రంగయ్య, సారయ్య, వీరభద్రయ్య, సమ్మయ్య, ఎల్లయ్య, వెంకటి, ఎం.రమేష్ తదితరులు పాల్గొన్నారు.
సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం నేతలు సీతారామయ్య, రాజ్‌కుమార్