కదలని దస్త్రం!
నిర్మాణ వ్యయం పెరిగే అవకాశం
భద్రాచలం వద్ద గోదావరి కరకట్టకు ‘క్రాసింగ్’ బ్రేక్!
జాతీయ రహదారిపై ఓవర్ బ్రిడ్జికి
అనుమతుల్లో జాప్యం
డిజైన్ పంపి రెండు నెలలు గడిచినా ఆమోదించని సీడీఓ
వంతెన మినహా గోదావరి కరకట్ట
పనులన్నీ పూర్తి
మంత్రులు
దృష్టిసారించినా
భద్రాచలం: గోదావరి కరకట్టలో భాగంగా చేపట్టిన క్రాసింగ్ బ్రిడ్జి నిర్మాణానికి అడుగులు ముందుకు పడటం లేదు. సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ నుంచి అనుమతులు రావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. కరకట్ట నిర్మాణం దాదాపుగా పూర్తయినా జాతీ య రహదారిపై క్రాసింగ్ బ్రిడ్జి పెండింగ్‌లో పడిపోయింది. గోదావరి వరదల నుంచి భద్రాచలానికి రక్షణగా 2000 సంవత్సరంలో కరకట్ట నిర్మించారు. కూనవరం రోడ్డుకు ఇరువైపులా 700 మీటర్ల మేర పనులు అప్పుడు ఆగిపోయాయి. ఆ పనులను రూ. 38 కోట్లతో పూర్తి చేస్తామని బీఆర్‌ఎస్ ప్రభుత్వం గత ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. ఆ తర్వాత గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేసి పనులు చేపట్టింది. 2024 జూన్ నాటికి పనులు పూర్తికావాల్సి ఉండగా, ఇప్పటివరకు మట్టి, రిటైనింగ్, ఇతర పనులు పూర్తయ్యా యి. కరకట్టలో నిర్మాణంలో భాగంగా విజయవాడ–జగదల్‌పూర్ జాతీయ రహదారిపై తలపెట్టిన ఓవర్ క్రాసింగ్ బ్రిడ్జి నిర్మాణంలో మాత్రం కదలిక లేదు.
సీడీఓ అనుమతుల్లో జాప్యం
నిర్మాణ పనుల బాధ్యత తీసుకున్న ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ బ్రిడ్జి డిజైన్‌ను రూపొందించి అనుమతి కోసం హైదరాబాద్‌లోని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్(సీడీఓ)కు పంపించింది. రెండు నెలలు గడిచినా అక్కడి నుంచి అనుమతి రాలేదు. సీడీఓ సూచనల ప్రకారం పలుమార్లు డిజైన్‌లో మార్పులు చేశారు. మళ్లీ ఇటీవల కరకట్ట రిటైనింగ్ వాల్, ఇతర సమస్యలను ప్రస్తావిస్తూ సీడీఓ అధికారులు సందేహాలను వ్యక్తం చేశారు. దీంతో బ్రిడ్జి కథ మళ్లీ మొదటికొచ్చింది. ఈ నేపథ్యంలో డిజైన్ ఫైనల్ కావడానికి ఎంత సమయం పడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. సాధారణంగా ఇలాంటి పనులను తగిన బడ్జెట్‌ను అందచేస్తే ఆయా శాఖలే పూర్తి చేస్తాయి. తమదికాని నిర్మాణాలను ఒప్పుకున్న ఇరిగేషన్ శాఖ అధికారులు పనులు పూర్తి చేయలేక తలలు పట్టుకుంటున్నారు.
ఓవర్ క్రాసింగ్ బ్రిడ్జి, కరకట్ట, అప్రోచ్ రోడ్డులకు సంబంధించి డిజైన్ సీడీఓకు పంపించాం. వారి సూచనల ప్రకారం చేర్పులు, మార్పులతో నూతన డిజైన్ రూపొందిస్తాం. వీలైనంత తొందరగా పనులను పూర్తి చేసేందుకు కృషి చేస్తాం.
– సయ్యద్ అహ్మద్ జానీ,
ఇరిగేషన్ ఈఈ, భద్రాచలం డివిజన్
బ్రిడ్జి డిజైన్‌ను సీడీఓ ఆమోదించాక ఆర్‌అండ్‌బీ, నేషనల్ హైవే శాఖలు ఆమోదించాల్సి ఉంది. ఆ తర్వాత దస్త్రం ప్రభుత్వం వద్దకు పంపితే నిధులు కేటాయిస్తుంది. గతంలో కరకట్టకు రూ.38 కోట్లు విడుదల చేయగా, ప్రస్తుతం ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.70 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు ఖర్చవుతుందని అధికారులు చెబుతున్నారు. జిల్లా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు ఇప్పటికే పలుమార్లు కరకట్టను పరిశీలించారు. అయినా క్రాసింగ్ బ్రిడ్జి నిర్మాణంలో కదలికలేదు. ఇప్పటికై నా దృష్టి సారించి త్వరితగతిన ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని భద్రాచలం ప్రజలు కోరుతున్నారు.
కదలని దస్త్రం!
కదలని దస్త్రం!


