
ఏదీ సన్నద్ధత..?
పరిశోధనాత్మక విద్యలో
విద్యార్థుల వెనకబాటు
ఎన్‌జీఎస్ పోటీల్లో జిల్లాకు
చివరి స్థానం
జూన్ నుంచీ జిల్లా సైన్స్
అధికారి పోస్టు ఖాళీ
కొత్తగూడెంఅర్బన్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పరిశోధనాత్మక విద్యలో వెనుకబడుతున్నారు. ఇన్‌స్పైర్, సైన్స్‌ఫేర్‌లకు విద్యార్థులను సన్నద్ధం చేయాల్సిన జిల్లా సైన్స్ ఆఫీసర్ (డీఎస్‌ఓ) పోస్టును భర్తీ చేయడంలో విద్యాశాఖ అధికారులు జాప్యం చేస్తున్నారు. విద్యార్థి దశలోనే టెక్నాలజీ రంగంలో మొబైల్స్, ఇంటర్నెట్, మెడిసిన్, పర్యావరణం, వాయు కాలుష్యం, జీవ వైవిధ్యం, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలపై అవగాహన పెంచుకోవాల్సి ఉంటుంది. నూతన ఆవిష్కరణలతో సైన్స్ పోటీల్లో పాల్గొంటే కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం కలుగుతుంది. ఇందుకు జిల్లా సైన్స్ ఆఫీసర్ దిశానిర్దేశం చేయాల్సి ఉంది. కానీ ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి జిల్లా సైన్స్ ఆఫీసర్ పోస్టు ఖాళీగానే ఉంది. భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసినా పైరవీలు ఎక్కువ కావడంతో నియామకాన్ని నిలిపివేశారు.
కొరవడిన పర్యవేక్షణ
ప్రభుత్వ పాఠశాలల్లో జూన్ నుంచి సైన్స్ పోటీలు, అవగాహన కార్యక్రమాలపై పర్యవేక్షణ కొరవడింది. ఇటీవల రాష్ట్రస్థాయిలో ఎన్‌జీసీ ఆధ్వర్యంలో సైన్స్ యాక్టివిటిలు, క్విజ్ పోటీలు నిర్వహించగా, జిల్లా నుంచి కొద్ది మంది విద్యార్థులే పాల్గొన్నారు. వారు కూడా చివరి స్థానంలో నిలిచారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో సైన్స్‌ఫేర్ ఇన్‌స్పైర్ పోటీలు జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో నిర్వహిస్తారు. ఆ పోటీలపై విద్యార్థులకు అవగాహన కల్పించి, దరఖాస్తులు చేయించాల్సి ఉంటుంది. పోటీల్లో పాల్గొనేలా విద్యార్థులను సిద్ధం చేయాలి. గతేడాది ఎంపికై న ఇన్స్‌ఫైర్ పోటీల్లో ఎంపికై న 113 ప్రాజెక్టులతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. సైన్స్ ఆఫీసర్ పోస్టు ఖాళీగా ఉండటంతో ప్రస్తుతం పాఠశాలలో ఇవేమీ జరగడంలేదు.