
వందేళ్లు పటిష్టంగా ఉండేలా..
అప్పటి ఇంజనీర్ల పనితీరు అద్భుతం
పాల్వంచరూరల్: రెండు గుట్టల మధ్య నిర్మించిన కిన్నెరసాని ప్రాజెక్ట్ నాటి ఇంజనీర్ల ప్రతిభకు దర్పణం పడుతోంది. సరైన వాహనాలు, యంత్రాలులేని కాలంలో పటిష్ట కట్టడం నిర్మించారు. ఏపీఎస్‌ఈబీ (ప్రస్తుతం జెన్‌కో) సంస్థ రూ.5.58 కోట్లతో కిన్నెరసాని గ్రామ సమీపంలో కిన్నెరసాని నదిపై ప్రాజెక్ట్ నిర్మించింది. 1962 నుంచి 1972 వరకు నిర్మాణ పనులు చేపట్టారు. నాటి ఇరిగేషన్‌శాఖ కార్యనిర్వహణ ఇంజనీర్ రామకృష్ణరాజు నేతృత్వంలో పది మంది ఇంజనీర్లు కలిసి 13 క్రస్ట్ గేట్లతో రెండు దశల్లో ప్రాజెక్టు నిర్మాణ పనులను పూర్తిచేశారు. స్కాపర్లు, ఎడ్లబండ్లను వినియోగించి స్థానికంగా లభించిన రాళ్లు, ఇసుక, తోగ్గూడెం నుంచి కంకరను తీసుకొచ్చి నిర్మాణం జరిపారు. ఇందుకోసం పదేళ్లపాటు ఐదువేల మంది కార్మికులు పనులు నిర్వహించారు. బరువులు మోసేందుకు గాడిదలను వినియోగించినట్లు చుట్టుపక్కల ప్రజలు చెబుతున్నారు. రాష్ట్ర నలుమూలల విద్యుత్ పంచే పాల్వంచలోని కేటీపీఎస్‌కు కిన్నెరసాని ద్వారానే నీరు అందుతోంది. ఎన్‌ఎండీసీ, నవభారత్ పరిశ్రమలకు, 10 వేల ఎకరాలకు సాగు నీరు, కొత్తగూడెం కార్పొరేషన్‌కు తాగునీరు అందిస్తోంది. ఆరు దశబ్దాలు గడిచినా, రిజర్వాయర్‌కు ఎన్నోమార్లు వరద పోటెత్తినా ప్రాజెక్ట్ పటిష్టత దెబ్బతినలేదు.
కిన్నెరసాని ప్రాజెక్ట్ రూపకల్పన, కట్టినతీరు నేటి ఇంజనీర్లకు ఆదర్శనీయం. సౌకర్యాలు అందుబాటులోలేని రోజుల్లో వందేళ్ల వరకు ఏ సమస్యా రాకుండా నిర్మించారు. ప్రాజెక్టు గేట్ల కింద స్లూయిస్‌ను పటిష్టంగా నిర్మించారు. నిర్మాణం ఎంతో శ్రమతో కూడుకున్నది. అప్పటి ఇంజనీర్ల పనితీరు అద్భుతంగా ఉంది.
–బి.అర్జున్, జలవనరులశాఖ ఈఈ
1962లో కిన్నెరసాని ప్రాజెక్ట్ నిర్మాణం

వందేళ్లు పటిష్టంగా ఉండేలా..