పురాతన కాలంలో డంగు సున్నంతో, 24 ఇంచుల గోడలతో భవనాల నిర్మాణం చేశారు. బలంగా ఉండేందుకు ఐరన్ దూలాల మీద స్లాబ్ నిర్మాణం చేసేవారు. అప్పటి ఇంజనీర్లంతా మన్నికకు ప్రాధాన్యత ఇచ్చారు. నూటికి నూరుశాతం నిధులు సక్రమంగా వినియోగిస్తే ఇప్పుడైనా మన్నిక కలిగిన భవనాలు నిర్మించవచ్చు.
–రామకృష్ణ, డీఈ, పంచాయతీ రాజ్ విభాగం
ఇల్లెందు: సుమారు 120 ఏళ్ల క్రితం ఇల్లెందు ప్రాంతంలో బొగ్గు నిక్షేపాల అన్వేషణ జరిగింది. ఆ సమయంలో బ్రిటీష్ అధికారుల కోసం నిర్మించిన భవనాలు ఇప్పటికీ పటిష్టంగా ఉన్నాయి. నాటి ఇంజనీర్ల మేధస్సుతో నిర్మించిన కట్టడాల్లో ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాలు కొనసాగుతున్నాయి. ఇల్లెందు చెరువు నుంచి నీటిని ఫిల్టర్ బెడ్ వరకు మోటారు లేకుండా నేరుగా చెరువులోకి తరలించేందుకు సైఫన్ నిర్మాణం చేపట్టారు. అర కిలోమీటర్ దూరంలో ఉన్న ఫిల్టర్ బెడ్ వరకు చెరువు నుంచి సుమారు 5 ఫీట్ల లోపల పైపులైన్ ఏర్పాటు చేసి చెరువులో ఓ సైఫన్‌తో అనుసంధానం చేశారు. సైఫన్ ద్వారా నీరు పైపులైన్‌లోకి చేరి ఫిల్టర్ బెడ్‌కు చేరేలా నిర్మించారు. నేటికీ ఆ సైఫన్ చెక్కు చెదరలేదు. నాడు రెవ. సీబీ వార్డ్ కోసం నిర్మించిన భవనంలో ప్రస్తుతం మిషన్ స్కూల్ కొనసాగుతోంది. నాడు ఏరియా కాలరీ మేనేజర్‌లు నివాసం ఉన్న భవనాల్లో సీఎస్‌ఐ చర్చి, కోర్టు, సింగరేణి సూపర్ బజార్ ఏర్పాటు చేశారు. మెయిన్‌రోడ్డు పాఠశాల, ఎంపీడీఓ ఆఫీస్, ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్, పోస్టాఫీసు భవనాలు బ్రిటిష్ కాలంలోనే నిర్మించినవే.
ఇల్లెందులో 120 ఏళ్ల భవనాలు