
నేత్రపర్వంగా నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామివారి నిత్యకల్యాణ వేడుక ఆదివారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి స్వామివారిని పల్లకీసేవగా చిత్రకూట మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. నిత్యకల్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
రామయ్య సేవలో ఎన్నికల కమిషనర్
శ్రీసీతారామ చంద్రస్వామివారిని రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ ఐ.రాణి కుముదిని ఆదివారం దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించారు. అనంతరం దేవస్థాన అనుబంధ ఆలయాలను సందర్శించగా అధికారులు స్వామివారి ప్రసాదం, జ్ఞాపికను అందజేశారు. ఆలయ ఈఓ దమోదర్‌రావు, ఏఈఓ శ్రవణ్‌కుమార్, ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, పంచాయతీ ఈఓ శ్రీనివాసరావు, ఆర్‌ఐ నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.
కొత్తగూడెం, భద్రాచలంలో నేడు ప్రజావాణి
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలో అత్యధిక వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కొత్తగూడెం డివిజన్‌కు సంబంధించి కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయంలో, భద్రాచలం డివిజన్‌కు సంబంధించి భద్రాచలం సబ్‌కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇతర సమస్యలు ఉన్నవారు కలెక్టరేట్‌లోని ఇన్‌వార్డ్ సెక్షన్‌లో తమ దరఖాస్తులను అందించి రశీదు పొందాలని, వాటిని సంబంధిత అధికారులకు పరిష్కారం నిమిత్తం పంపిస్తామని వివరించారు. కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమం ఉండదని పేర్కొన్నారు.
భద్రాద్రితో
విడదీయరాని బంధం
కవి సమ్మేళనంలో గజల్ శ్రీనివాస్
భద్రాచలంటౌన్: భద్రాచలానికి రామయ్య దర్శనంతోపాటు అనేక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చానని భద్రాద్రితో తనకు విడదీయరాని బంధం ఉందని ప్రముఖ గజల్ సింగర్, మాస్ట్రో గజల్ శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని తాతగుడి సెంటర్‌లో ఉన్న లైబ్రరీ హాల్‌లో ఆంధ్ర సారస్వత పరిషత్, భద్రాద్రి కవి గాయకుల ఆధ్వర్యంలో ఆదివారం కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. సమ్మేళనానికి ఇరు రాష్ట్రాల నుంచి హాజరైన గాయకులు తమ గానాలతో అలరించారు. చివరిలో గజల్ శ్రీనివాస్ గజల్స్ గానం సంగీత ప్రియులను మైమరిపించింది. నిర్వాహకులు గాయకులను సన్మానించి, జ్ఞాపికలు అందజేశారు. ఆంధ్ర సారస్వత పరిషత్ జిల్లా అధ్యక్షురాలు చిట్టే లలిత, పామరాజు తిరుమలరావు, కళాకారులు, గాయకులు, సంగీత ప్రియులు పాల్గొన్నారు.
కార్టూన్ పోటీలకు
ఎంట్రీల ఆహ్వానం
ఖమ్మంగాంధీచౌక్ : వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో తెలుగు వికాసం శీర్షికతో కార్టూన్ పోటీలు నిర్వహించనున్నట్లు సారస్వత పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ గజల్ శ్రీనివాస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. విజేతలకు ప్రథమ బహుమతిగా రూ. 5,116, ద్వితీయ బహుమతిగా రూ. 3,116, తృతీయ బహుమతి రూ. 2,116తో పాటు మూడు ప్రత్యేక నగదు బహుమతులు రూ. 516 చొప్పున, ప్రశంసాపత్రాలు అందిస్తామని వివరించారు. వయసుతో నిమిత్తం లేకుండా ఒక్కొక్కరు రెండు కార్టూన్లు పంపొచ్చని, ఏ4 సైజ్‌లో ఉండాలని, గతంలో ప్రచురితమైనవి పంపొద్దని సూచించారు. అక్టోబర్ 10 నాటికి నిర్వాహకులకు అందాలని, విజేతలను అక్టోబర్ 29న ప్రకటిస్తామని, తెలుగు మహాసభల సందర్భంగా నగదు బహుమతులు ప్రదానం చేస్తామని తెలిపారు. కార్టూన్లను 98660 84124 వాట్సాప్ నంబర్‌కు పంపించాలని కోరారు.

నేత్రపర్వంగా నిత్యకల్యాణం