
ఆసిఫాబాద్ జిల్లాలో నలుగురు మృతి...
మృతుల్లో తల్లీకుమారుడు, మరో ఇద్దరు బాలికలు
భద్రాద్రి జిల్లాలో ఇద్దరు కూలీల గల్లంతు
ఆసిఫాబాద్/అశ్వారావుపేటరూరల్: వాగు నీరు ఆరుగురిని మింగేసింది. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం చికిలివాగులో ఖాళీ యూరియా సంచులు కడుగుతుండగా జరిగిన ప్రమాదంలో నలుగురు మృతిచెందగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం కావడిగుండ్ల గ్రామానికి పనులకోసం వచ్చి ఇద్దరు ఏలూరు వాసులు గల్లంతయ్యారు. వివరాలు.. ఖాళీ యూరియా సంచులు కడుగుతుండగా జరిగిన ప్రమాదంలో కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం చికిలివాగులో పడి నలుగురు మృతిచెందారు.
దాబా గ్రామానికి చెందిన మోర్లె నిర్మలాబాయి, ఆమె కుమారుడు గణేశ్, మరో ఇద్దరు బాలికలు వాడై మహేశ్వరి, ఆదె శశికళ శనివారం చికిలి వాగులో ఖాళీ యూరియా సంచులు కడిగేందుకు వెళ్లారు. నిర్మలాబాయి యూరియా సంచులు కడుగుతుండగా ఒక సంచి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. దీంతో అక్కడే ఉన్న గణేశ్ ఆ సంచిని తెచ్చేందుకు నీటిలోకి దిగి మునిగిపోయాడు. దీంతో అతడిని కాపాడేందుకు అక్కడే ఉన్న బాలికలు శశికళ, మహేశ్వరి కూడా వాగులోకి దిగారు.
వారుకూడా నీళ్లలో మునుగుతుండటం గమనించిన నిర్మలాబాయి రక్షించే ప్రయత్నంలో వారితో పాటే మునిగిపోయింది. గమనించిన నిర్మలాబాయి చిన్న కూతురు లలిత అరుస్తూ వెళ్లి చుట్టుపక్కల ఉన్న వారికి సమాచారం అందించింది. దీంతో వారంతా వాగులో గాలించగా నిర్మలబాయి (33), గణేశ్ (12), మహేశ్వరి (10), శశికళ (8) మృతదేహాలు లభ్యమయ్యాయి. సీఐ సత్యనారాయణ, ఎస్సైలు మహేందర్, మ«ధుకర్ ఘటన స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు.
వాగులో కొట్టుకుపోయి కూలీల గల్లంతు..
వ్యవసాయ పనులు చేసేందుకు వచ్చిన కూలీల్లో ఇద్దరు వా గు ప్రవాహంలో గల్లంతయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం కావడిగుండ్ల గ్రామానికి చెందిన రైతు కోటేశ్వరరావు పత్తి పొలంలో కలుపు తీసేందుకు కూలీలను మాట్లాడాడు. ఏపీ రాష్ట్రంలోని ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం పూచికపాడుకు చెందిన పాలడుగుల చెన్నమ్మ (60), పచ్చితల వరలక్ష్మి (55)తోపాటు మరో ఐదుగురు శనివారం వచ్చారు. అయితే, మధ్యాహ్న భోజనం తర్వాత భారీ వర్షం మొదలవడంతో కూలీలంతా ఇళ్లకు బయలుదేరారు.
పొలానికి కొద్ది దూరంలోఉన్న అశ్వారావుపేట మండలం గోపన్నగూడెం–కన్నాయిగూడెం వాగు దాటుతున్నా రు. ఈ క్రమంలో ఎగువ నుంచి గుబ్బల మంగమ్మ వాగు, కొండవాగు ఉధృతంగా ప్రవహించడంతో కూలీలు ఒడ్డుకు పరుగులు తీశారు. వీరిలో వెనకాల ఉన్న చెన్నమ్మ, వరలక్ష్మి మాత్రం వాగు ప్రవాహంలో కొట్టుకుపోయారు. అశ్వారా వుపేట ఎస్సై యాయతీ రాజు, అగి్నమాపక శాఖ అధికారులతోపాటు ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది ఘటనాస్థలి వద్ద గాలించినా రాత్రి వరకు కూలీల ఆచూకీ లభ్యం కాలేదు.