
‘ప్రీ ప్రైమరీ’ని అంగన్‌వాడీల్లోనే కొనసాగించాలి
చర్ల: ప్రీ ప్రైమరీ విద్యను అంగన్‌వాడీ కేంద్రాల్లోనే కొనసాగించాలని తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జయలక్ష్మి డిమాండ్ చేశారు. యూనియన్ జిల్లా నాలుగో మహాసభ శనివారం మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఐసీడీఎస్ నిబంధనలకు విరుద్ధంగా ప్రీ ప్రైమరీ విద్యను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాశాఖలో విలీనం చేయడం సరికాదని అన్నారు. ఫేస్ క్యాప్చర్ యాప్ రద్దు చేసి, అంగన్‌వాడీ టీచర్లకు 5జీ మొబైల్ ఫోన్లను అందించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్‌వాడీ టీచర్లకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని పీఎఫ్, ఈఎస్‌ఐతో పాటు ప్రమాద బీమా సౌకర్యాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 15న రాష్ట్ర వ్యాప్తంగా మంత్రుల ఇళ్ల ముందు ధర్నాలు చేయనున్నట్లు తెలిపారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కె.బ్రహ్మచారి, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్, యూనియన్ జిల్లా కార్యదర్శి జి.పద్మ, అధ్యక్షురాలు ఈసం వెంకటమ్మ, ఉపాధ్యక్షురాలు పాయం రాధాకుమారి, నాయకులు ఎం.విజయశీల, శకుంతల, వీరభద్రమ్మ, స్వరూప, కళావతి, రాజ్యలక్ష్మి, కృష్ణవేణి, భాను, జయసుధ కమలాదేవి గజలక్ష్మి, జానకి, సావిత్రి తదితరులు పాల్గొన్నారు
అంగన్‌వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి