
గిరిజన విద్యార్థికి ఆర్థికసాయం
భద్రాచలంటౌన్: ప్రభుత్వ పాఠశాలలో చదివి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ హిస్టరీలో సీటు సాధించిన పాయం కాంతారావుకు ఐటీడీఏ పీఓ బి.రాహుల్ శనివారం ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ.. దుమ్ముగూడెం మండలం తాటివారిగూడెం గ్రామానికి చెందిన పాయం కాంతారావుకు ఐటీడీఏ ద్వారా ప్రోత్సాహకంగా రూ.30 వేలు అందించామని, తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపకుండా నెలకు కొంత ఆర్థిక వెసులుబాటు చేసుకోవడానికి ప్రయత్నించాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీఓ డేవిడ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయులకు
వర్క్ షాప్
దమ్మపేట: మండలంలోని ప్రైవేట్ ఉపాధ్యాయులకు లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో దమ్మపేటలోని బోటనీ బాలాజీ ప్రైవేట్ స్కూల్‌లో ట్రైనింగ్ వర్క్ షాపును శనివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా లయన్స్‌క్లబ్ ప్రోగ్రామర్ కొండపల్లి రేణుక హాజరై మాట్లాడారు. పాఠ్యాంశాల బోధనలో అనుసరించాల్సిన మెళకువలను వివరించారు. శిక్షణకు సంబంధించిన మెటిరీయల్‌ను అందజేశారు. కార్యక్రమంలో లయన్స్‌క్లబ్ బాధ్యులు లక్కినేని నరేంద్రబాబు, అంకత మహేశ్వరరావు, వేణు, కోటగిరి మోహన్‌రావు, సూర్యారావు, చలపతి, అమృతవల్లి తదితరులు పాల్గొన్నారు.
సీతారాం ఏచూరికి నివాళి
ములకలపల్లి: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్ర కమ్యూనిస్టులదేనని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు అన్నవరపు కనకయ్య అన్నారు. పార్టీ మండల కార్యదర్శి ముదిగొండ రాంబాబు అధ్యక్షతన శనివారం ఏర్పాటు చేసిన సాయుధ తెలంగాణ పోరాట వారోత్సవాల సభలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. తొలుత కమ్యూనిస్టు దిగ్గజం సీతారాం ఏచూరి తొలి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. కార్యక్రమంలో మాలోత్ రావూజా, గౌరి నాగేశ్వరరావు, నిమ్మల మధు, పాయం అమల తదితరులు పాల్టొన్నారు.
జామాయిల్ చెట్లు నరికివేత
టేకులపల్లి: సింగరేణి ఆధ్వర్యంలో టేకులపల్లి నుంచి పెట్రాంచెలక స్టేజీ వరకు పదేళ్ల క్రితం జామాయిల్ చెట్లను నాటారు. తుమ్మలచెలక స్టేజీలో కరెంటు తీగలకు అడ్డు వస్తున్నాయంటూ శుక్రవారం స్థానికులు కొందరు జామాయిల్ చెట్లను నరికివేశారు. ఆ కలపను అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. రోజూ అదే మార్గంలో రాకపోకలు సాగించే సింగరేణి, ఫారెస్టు అధికారులు మాత్రం చెట్లు నరికివేసిన వారిపై చర్యలు తీసుకోవడంలేదు.
ములకలపల్లిలో..
ములకలపల్లి: మండల పరిధిలోని రామాంజనేయపురం గ్రామ శివారు సీతారామ ప్రాజెక్ట్ కాలువ సమీపంలో సుమారు పది జామాయిల్ చెట్లను శనివారం రాత్రి అక్రమంగా నరికివేశారు. కలపను ట్రాక్టర్‌లో తరలించేందుకు సమాయత్తమయ్యారు. స్థానికుల ద్వారా సమాచారంతో పరిశీలించేందుకు మీడియా వెళ్లగా గమనించిన అక్రమార్కులు ఉడాయించారు. ఈవిషయమై టీఎస్‌ఎఫ్‌డీసీ ప్లాంటేషన్ మేనేజర్ పీఎం సైదానాయక్‌ను వివరణ కోరగా.. దుంగలు, ట్రాక్టర్ స్వాధీనం చేసుకున్నామని, డిపోకు తరలిస్తామని తెలిపారు.
చికిత్స పొందుతున్న
వ్యక్తి మృతి
చింతకాని: మండలంలోని నాగిలిగొండకు చెందిన ఉచ్చర్ల కల్యాణ్(31) ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈనెల 11న పురుగుల మందు తాగాడు. దీంతో ఆయనను ఖమ్మం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. ఘటనపై ఆయన తండ్రి రమేష్ ఇచ్చిన ఫిర్యాదుతో శనివారం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నాగుల్‌మీరా తెలిపారు. కాగా, కల్యాణ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

గిరిజన విద్యార్థికి ఆర్థికసాయం

గిరిజన విద్యార్థికి ఆర్థికసాయం