
ప్రజల కోసం పోరాడిన సురవరం
● సుధాకర్‌రెడ్డి మృతి ప్రజాఉద్యమాలకు తీరని లోటు ● సంస్మరణ సభలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
ఖమ్మంమయూరిసెంటర్: సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రజల కోసం పోరాడిన నికార్సయిన కమ్యూనిస్టు సురవరం సుధాకర్‌రెడ్డి అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఇటీవల మృతి చెందిన సురవరం సంస్మరణ సభ ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో శనివారం నిర్వహించగా ఆయన చిత్రపటం వద్ద వివిధ పార్టీల నాయకులు నివాళులర్పించారు. అనంతరం సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ అధ్యక్షతన జరిగిన సభలో కూనంనేని మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ప్రజాఉద్యమ గొంతుకగా సురవరం పనిచేశారని, ఆయన మరణం కమ్యూనిస్టు ఉద్యమానికే కాక పేద ప్రజలకు తీరని లోటన్నారు. కాగా, మతం, సైన్స్‌కు ప్రాంతీయ భేదం లేనట్లే కమ్యూనిజానికి సైతం ప్రాంతీయత లేదన్నారు. కమ్యూనిజం విడిపోయి బలహీనపడినా మళ్లీ ఐక్యతతో బలపడతామని తెలిపారు. అందరినీ ఏకతాటిపైకి తీసుకురావడమే సుధాకర్‌రెడ్డి లాంటి అమరులకు ఇచ్చే నివాళి అని చెప్కాపరు. కాగా, వందేళ్ల కమ్యూనిస్టు ఉద్యమ ఘట్టాన్ని నేటి తరానికి వివరిస్తూ బలమైన ప్రజాఉద్యమ నిర్మాణాల కోసం డిసెంబర్ 26న ఖమ్మంలో శత వసంత ముగింపు సభ నిర్వహిస్తున్నట్లు కూనంనేని తెలిపారు. ఈ సభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి పోరాటాలను నడిపిన సురవరం ఎందరికో ఆదర్శంగా నిలిచారని తెలిపారు. గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావుతో పాటు వివిధ పార్టీలు, సంఘాల నాయకులు బాగం హేమంతరావు, పువ్వాళ్ల దుర్గాప్రసాద్, డాక్టర్ రవీంద్రనాథ్, గోకినేపల్లి వెంకటేశ్వరరావు, ఆవునూరి మధు, నున్నా నాగేశ్వరరావు, మహ్మద్ మౌలానా, కె.రాంనారాయణ, ఆకుతోట ఆదినారాయణ, జమ్ముల జితేందర్రెడ్డి, స్పర్శ భాస్కర్, రవిమారుత్, పోట్ల మాధవరావు, డాక్టర్ వై.ప్రసాద్, వడ్డె నారాయణరావు, యర్రా బాబు, జానీమియా, కొండపర్తి గోవిందరావు, సిద్దినేని కర్ణకుమార్, క్లెమెంట్, మహ్మద్ సలాం, పోటు కళావతి తదితరులు పాల్గొన్నారు.