
ఎట్టకేలకు ‘మత్స్య’ టెండర్లు..
టెండర్లను రేపు పరిశీలిస్తాం
పాల్వంచరూరల్: జిల్లాలో ఉచిత చేప పిల్లల(సీడ్) పంపిణీకి ఎట్టకేలకు మార్గం సుగమమైంది. 2025–2026 సంవత్సరానికి టెండర్ ప్రక్రియ రెండు రోజుల క్రితం ముగిసింది. మూడుసార్లు ఆన్‌లైన్‌లో టెండర్లు నిర్వహించినా ఒక్కరూ పాల్గొనలేదు. శుక్రవారం చివరిసారిగా నిర్వహించిన ప్రక్రియలో నలుగురు టెండర్లు దాఖలు చేశారు. ఆంధ్రాకు చెందిన ఇద్దరు, జిల్లా నుంచి మరో ఇద్దరు కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేశారు. ప్రక్రియ పూర్తిచేసి ఈ నెలాఖరులోగా జలాశయాల్లో చేప పిల్లలను విడుదల చేసేందుకు జిల్లా మత్స్యశాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
కోటి 20 లక్షల చేప పిల్లల పంపిణీ
ఈ ఏడాది జిల్లాలోని చెరువులు, కుంటలు, జలాశయాల్లో కోటి 20 లక్షల చేపపిల్లలను పంపిణీ చేయాలని మత్స్యశాఖ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. 550 చెరువుల్లో చేప పిల్లలను పోయాలని ప్రణాళిక రూపొందించింది. ఈసారి చిన్న చెరువులు, కుంటల్లో చేప పిల్లల పెంపకం చేపట్టొద్దని మత్స్యశాఖ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే చేపపిల్లలను చెరువుల్లో పోసే సీజన్ ప్రారంభమైందని, పంపిణీ ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలని మత్స్యకారులు కోరుతున్నారు. కాగా గతేడాది కూడా ఆలస్యంగా, అది కూడా 86 లక్షల చేపపిల్లలను మాత్రమే పంపిణీ చేసి అధికారులు చేతులు దులుపుకున్నారు. జిల్లాలో చేపల పెంపకానికి 734 చెరువులు, కుంటలు ఉండగా, 70 మత్స్య పారిశ్రామిక సొసైటీలు ఉన్నాయి. ఇందులో 3,248 మంది సభ్యులు ఉన్నారు. 10 వేల మంది ఉపాధి పొందుతున్నారు. ఇక కిన్నెరసానిలోని మత్స్యశాఖ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రంలో అధికారులు ముందుగానే గుడ్లను(స్పాన్) పోశారు. రెండు నెలలపాటు పెంచాక గిరిజన మత్స్యకార సొసైటీలకు 20 లక్షల చేప పిల్లలను పంపిణీ చేయనున్నారు.
రేపు అదనపు కలెక్టర్ సమక్షంలో పరిశీలన
ఆన్‌లైన్ టెండర్లు నిర్వహించగా నలుగురు బిడ్లు దాఖలు చేశారు. ఫారాలను అదనపు కలెక్టర్ సమక్షంలో సోమవారం పరిశీలిస్తాం. నిబంధనల ప్రకారం ఉంటే మత్స్యశాఖ కమిషనర్‌కు పంపి, ఆమోదం పొందుతాం. తక్కువకు కోట్ చేసిన కాంట్రాక్టర్‌కు టెండర్లు దక్కే అవకాశాలు ఉన్నాయి. –ఎండీ ఇంతియాజ్ అహ్మద్‌ఖాన్,
జిల్లా మత్స్యశాఖ అధికారి

ఎట్టకేలకు ‘మత్స్య’ టెండర్లు..