జిల్లాకు సీతారామ జలాలు ఇవ్వాలి
ములకలపల్లి: సీతారామ ప్రాజెక్ట్ జలాలు జిల్లా సాగు భూములకు ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్ డిమాండ్ చేశారు. మండల పరిధిలోని 48.30 కి.మీ. వద్ద కూలిన పాసేజ్ పిల్లర్ ప్రదేశాన్ని శుక్రవారం ఆయన సందర్శించి మాట్లాడారు. నాసిరకం నిర్మాణం వల్లే పిల్లర్ కూలిందని ఆరోపించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రధాన కాలువలతోపాటు డిస్ట్రిబ్యూటరీ కాల్వల నిర్మాణాలు తక్షణమే పూర్తి చేయాలన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు అన్నవరపు కనకయ్య, రైతు సంఘం జిల్లా కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ, జిల్లా నాయకుడు కొండబోయిన వెంకటేశ్వర్లు, పార్టీ మండల కార్యదర్శి ముదిగొండ రాంబాబు, ఊకంటి రవికుమార్, నిమ్మల మధు, గొగ్గెల ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.


