సులభం.. సత్వరం
● స్లాట్ బుకింగ్‌తో 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తి ● పైలట్‌గా ఉమ్మడి జిల్లాలో మూడుచోట్ల అమలు ● త్వరలోనే అన్ని కార్యాలయాల్లో విధానం
ఖమ్మంమయూరిసెంటర్: రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్లాట్ బుకింగ్ విధానంతో రిజిస్ట్రేషన్ తక్కువ సమయంలో పూర్తవుతోంది. స్లాట్ బుక్ చేసుకున్న సమయానికి వెళ్తే 15 నిమిషాల్లో పని పూర్తవుతుండగా, మరో పది నిమిషాల్లో దస్తావేజులు ఇస్తున్నారు. దీంతో రోజంతా పడిగాపులు కాయాల్సిన ఇబ్బందులు తప్పాయి. ఈవిధానంతో క్రయ విక్రయదారుల్లో ఆనందం వ్యక్తమవుతుండగా.. రిజిస్ట్రేషన్ కార్యాలయాల ఉద్యోగుల నుంచి సానుకూలత వస్తోంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలోని ఖమ్మం ఆర్‌ఓ కార్యాలయం, కొత్తగూడెం, కూసుమంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ విధానం అమలవుతుండగా.. త్వరలోనే అన్ని కార్యాలయాల్లోనూ అమలుకు సిద్ధమవుతున్నారు.
గంటల కొద్దీ వేచి ఉండి..
గతంలో దస్తావేజుల రిజిస్ట్రేషన్ కోసం రోజంతా క్రయ, విక్రయదారులు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పడిగాపులు కాయాల్సి వచ్చేది. దీంతో ఇద్దరికీ సమయం కుదరక పలుమార్లు వాయిదా వేసుకునేవారు. మరోవైపు కార్యాలయాల్లోనూ రద్దీ ఉండేది. ఒకే సమయాన పెద్దసంఖ్యలో జనం వస్తుండడంతో కార్యాలయ ఉద్యోగులకు ఇబ్బందులు ఎదురయ్యేవి. ఒక్కోసారి డాక్యుమెంట్లన్నీ పూర్తిగా పరిశీలించేందుకు సమయం దొరికేది కాదు. కానీ ఇప్పుడు స్లాట్ బుకింగ్‌తో ఈ ఇబ్బందులన్నీ తొలగిపోయాయి.
చిన్నచిన్న సమస్యలతో..
పైలట్ ప్రాజెక్టుగా ఉమ్మడి జిల్లాలోని మూడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రభుత్వం స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలుచేస్తోంది. తొలిసారి కావడంతో చిన్నచిన్న సమస్యలు ఎదురవుతున్నా అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పాత కంప్యూటర్లు, సర్వర్లను మార్చడంపై దృష్టి సారించిన నేపథ్యాన ఈ నెలాఖరు నాటికి సమస్యలన్నీ తీరతాయని చెబుతున్నారు.
అన్ని కార్యాలయాల్లో..
స్లాట్ బుకింగ్ విధానం ద్వారా రిజిస్ట్రేషన్‌తో మంచి మంచి ఫలితాలు వచ్చినందున విధానాన్ని త్వరలోనే అన్ని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తొలిదశలో రాష్ట్రవ్యాప్తంగా 25కార్యాలయాల్లో అమలు చేయగా.. ఇటీవల రెండో దశలో మరో 25 కార్యాలయాలు ఎంపిక చేశారు. ఈనెల 1 నుంచే అన్ని చోట్లా ఈ విధానాన్ని అమలు చేయాలని భావించినా సాంకేతిక కారణాలతో జూన్ 1వ తేదీకి వాయిదా వేసినట్లు తెలిసింది. ఇప్పటికే అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఏప్రిల్ 10 నుండి ఇప్పటివరకు స్లాట్ విధానంలో జరిగిన రిజిస్ట్రేషన్లు
కార్యాలయం డాక్యుమెంట్లు ఆదాయం
ఖమ్మం ఆర్‌ఓ 1,164 రూ.10.21 కోట్లు
కొత్తగూడెం 698 రూ.2.41 కోట్లు
కూసుమంచి 530 రూ.97 లక్షలు


