
మా ఊళ్లో ఏం జరుగుతోంది..?
‘మేరీ పంచాయతీ’ యాప్‌లో సమస్త సమాచారం
● నిధుల ఖర్చులో పారదర్శకతకు ప్రాధాన్యత ● ఆదాయ, వ్యయాలను గ్రామస్తులు తెలుసుకునే అవకాశం ● తద్వారా అక్రమాలకు అడ్డుకట్ట
భద్రాచలంఅర్బన్: గ్రామ పంచాయతీలో అభివృద్ధి వివరాలను ప్రజలు తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ‘మేరీ పంచాయతీ (నా పంచాయతీ)యాప్’ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్‌తో పంచాయతీల్లో ఆదాయ, వ్యయాల విషయంలో పారదర్శకత పాటించే అవకాశం ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే నిధులను పాలకవర్గం ఎలా ఖర్చు చేస్తోందనే విషయాన్ని ప్రజలు నేరుగా తెలుసుకోవచ్చు. ఈయాప్‌ను 2019లోనే రూపొందించినా పలు కారణాలు, సాంకేతిక సమస్యలతో ప్రజలకు కొన్ని వివరాలను అందించలేపోయింది. అయితే ప్రస్తుతం ఈ యాప్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది.
పారదర్శక పాలన..
గ్రామ పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటారు. ఆ నిధుల వినియోగానికి సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు యాప్‌లో పొందుపర్చాలని, తద్వారా గ్రామాల్లో పారదర్శక పాలన సాగుతుందని అధికారులు చెబుతున్నారు. నిధుల వివరాలు ఆన్‌లైన్‌లో ఉండడంతో గ్రామాభివృద్ధికి ఎలాంటి పనులను చేపడుతున్నారో ప్రజలు తెలుసుకోవచ్చు. ఇందులో వివరాల నమోదు సమయంలోనే జీపీఆర్‌ఎస్ ద్వారా గుర్తించే అవకాశం ఉండడంతో, అక్కడి పనులకు కేటాయించిన డబ్బును ఇతర చోట్ల వినియోగించేందుకు వీలుండదు. పాలకవర్గాలు సైతం పొరపాట్లు చేయడానికి అవకాశం ఉండదు. పాలకులు, అధికారులు తప్పుడు నివేదికలు రూపొందిస్తే ప్రజలకు ప్రశ్నించేందుకు వీలు కలుగుతుంది.
అన్ని వివరాలు నిక్షిప్తం..
గ్రామ పంచాయతీలకు సంబంధించిన నిధుల వివరాలు మాత్రమే కాకుండా సర్పంచ్, కార్యదర్శి, గ్రామ కమిటీలు, ఆస్తులకు సంబంధించిన వివరాలన్నీ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతీ సంవత్సరం పంచాయతీలకు మంజూరు చేసే నిధుల వివరాలు, ఏ పనికి ఎంత ఖర్చు చేశారు, అవి ఏ దశలో ఉన్నాయి అనే వివరాలు యాప్‌లో నమోదై ఉంటాయి. ఆదాయ, వ్యయాలతో పాటు పంచాయతీలో నిర్వహించే గ్రామ సభల వివరాలు సైతం యాప్‌లో అందుబాటులో ఉంటాయి.
ప్లేస్టోర్ ద్వారా...
స్మార్ట్ ఫోన్‌లో ఉండే ప్లేస్టోర్ యాప్‌లో ‘మేరీ పంచాయతీ’ పేరుతో సెర్చ్ చేయగానే వచ్చే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నాక లాగిన్ అవ్వాలి. ఆ వెంటనే ఫైనాన్షియల్ ఇయర్, స్టేట్, జిల్లా, మండలం, పంచాయతీ వివరాలు కనిపిస్తాయి. వాటిని నమోదు చేయగానే ఆయా పంచాయతీలకు సంబంధించిన అంశాలు కనిపిస్తాయి.
కొరవడిన అవగాహన
‘మేరీ పంచాయతీ’ యాప్‌నకు సంబంధించి గ్రామ పంచాయతీ అధికారులు ప్రజలకు అవగాహన కల్పించడంలో వెనకబడి ఉన్నారనే చెప్పాలి. చాలావరకు గ్రామాల్లో కొంత చదువుకున్న యువతకు తప్ప, ఇతరులకు ఈ యాప్ ఉన్నట్టు కూడా తెలియదు. యాప్‌పై అవగాహన లేకపోవడంతో చాలామంది తమ గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి వివరాలు తెలుసుకోలేకపోతున్నారు. ఇప్పటికై నా పంచాయతీ అధికారులు యాప్ పై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.
ప్రజలకు అవగాహన కల్పించాలి
పంచాయతీ పద్దులకు సంబంధించి ఇలాంటి యాప్ ఉన్న విషయం చాలామందికి తెలియదు. ప్రజలకు యాప్‌పై అవగాహన లేకపోవడంతో నిధుల వినియోగానికి సంబంధించి అధికారులను ప్రశ్నిస్తున్నారు. ప్రజలే నేరుగా నిధుల వివరాలను తెలుసుకునేలా అధికారులు ఈ యాప్‌పై అందరికీ అవగాహన కల్పించాలి.
– వీవీఎన్ ప్రసాద్, భద్రాచలం

మా ఊళ్లో ఏం జరుగుతోంది..?