ఎఫ్‌డీఓ కోటేశ్వరరావు
చండ్రుగొండ : వేసవి ఎండలు మండుతున్న నేపధ్యంలో దాహార్తి తీర్చుకునేందుకు వన్యప్రాణులు అటవీ ప్రాంతం నుంచి బయటకు రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు కొత్తగూడెం ఎఫ్‌డీఓ కోటేశ్వరరావు తెలిపారు. చండ్రుగొండలోని రేంజ్ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జంతువుల దాహార్తి తీర్చుకునేందుకు అడవుల్లో నీటి గుంటలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. బీట్ అధికారులు, బేస్‌క్యాంప్ సిబ్బంది, 50 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామన్నారు. సీసీ కెమెరాల ద్వారా వన్యప్రాణుల వేటకు వచ్చిన ఇద్దరిని గుర్తించి అరెస్టు చేశామన్నారు. డివిజన్ పరిధిలో 500 ఎకరాల్లో కొత్తగా ప్లాంటేషన్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అగ్నిప్రమాదాలు జరగకుండా ఐదు మీటర్ల విస్తీర్ణంలో ఫైర్‌లైన్‌లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రేంజర్ ఎల్లయ్య పాల్గొన్నారు.
ముగిసిన జాతరలు
గుండాల: మూడు రోజులుగా అంగరంగ వైభవంగా సాగుతున్న గోవిందరాజు, దూలుగొండ జాతరలు శుక్రవారంతో ముగిశాయి. మండలంలోని చెట్టుపల్లిలో సనప వంశీయుల ఇలవేల్పు అయిన గోవిందరాజు, రోళ్లగడ్డ దూలుగొండ దేవత జాతరల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారు జాము వరకు డోలీ చప్పుళ్ల నడుమ నృత్యాలు చేశారు. ఆయా దేవతలను గుట్టకు తరలించడంతో జాతరలు ముగిశాయి.
గిరిజన గురుకులంలో తాగునీటి పాట్లు
పాల్వంచరూరల్: మండల పరిధిలోని కిన్నెరసాని డ్యామ్ సైడ్‌లో ఉన్న గిరిజన గురుకుల పాఠశాలలో ఆర్‌ఓఆర్ వాటర్ ప్లాంట్ మరమ్మతులకు గురైంది. దీంతో విద్యార్థులు తాగునీళ్ల కోసం పాఠశాల నుంచి కళాశాలకు వస్తున్నారు. చిన్నారులు పెద్ద క్యాన్లలో పట్టుకుని సుమారు అరకిలోమీటర్ దూరం మోయాల్సివస్తోంది. సిబ్బంది ఉన్నా తాగునీళ్లు విద్యార్థులే తెచ్చుకుంటూ ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ శ్యామ్‌కుమార్‌ను వివరణ కోరగా.. ఆర్‌ఓఆర్ ప్లాంట్ మరమ్మతులకు గురైందని, బాగు చేసేందుకు మెకానిక్‌ను పిలిస్తే రావడం లేదని తెలిపారు. దీంతో విద్యార్థులు కళాశాల ప్రాగంణంలో ఉన్న ప్లాంట్ నుంచి తాగునీరు తెచ్చుకుంటున్నారని పేర్కొన్నారు.
గంజాయి సీజ్
భద్రాచలంఅర్బన్: ద్విచక్రవాహనంపై అక్రమంగా తరలిస్తున్న గంజాయిని శుక్రవారం పట్టణంలోని బ్రిడ్జి సెంటర్‌లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని సీలేరు నుంచి ద్విచక్రవాహనంపై రెండు కిలోల గంజాయిని ఇద్దరు వ్యక్తులు తీసుకెళ్తుండగా వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులు పట్టుకున్నారు. నిందితులు, ఖమ్మం జిల్లా వైరాకు చెందిన సమీర్, రామకృష్ణలను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
వన్యప్రాణులు అడవి దాటి రాకుండా చర్యలు
వన్యప్రాణులు అడవి దాటి రాకుండా చర్యలు