భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడక బుధవారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితరపూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
నేడు, రేపు కార్పొరేట్ మెడికల్ బోర్డు
సింగరేణి(కొత్తగూడెం): కొత్తగూడెంలోని సింగరేణి ప్రధానాస్పత్రిలో గురు, శుక్రవారాల్లో కార్పొరేట్ మెడికల్ బోర్డ్ నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. నేడు కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించనుండగా మెడికల్ రిపోర్ట్‌ల ఆధారంగా పని చేయలేని వారిని శుక్రవారం అన్‌ఫిట్ చేస్తామని తెలిపారు.
పీహెచ్‌సీలో
డీఎంహెచ్‌ఓ తనిఖీ
కొత్తగూడెంఅర్బన్ : కొత్తగూడెం పట్టణ పరిధి సఫాయిబస్తీలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి భాస్కర్‌నాయక్ బుధవారం తనిఖీ చేశారు. మందుల స్టాక్ రికార్డులు, సిబ్బంది హాజరు పట్టికలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కుష్ఠు వ్యాధి నిర్మూలనపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, ఇందుకోసం విస్తృత ప్రచారం నిర్వహించాలని పారా మెడికల్ సిబ్బందికి సూచించారు.
‘వాటర్ స్పోర్ట్స్ ఈవెంట్’లో నేటి నుంచి శిక్షణ
కొత్తగూడెంటౌన్: ఆశ్వాపురం మండలంలోని తుమ్మలచెరువు వద్ద ‘రోయిండ్ వాటర్ స్పోర్ట్స్ ఈవెంట్’లో గురువారం నుంచి ఈనెల 26వ తేదీ వరకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు డీవైఎస్‌ఓ పరంధామరెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అంతర్జాతీయ రోయింగ్ క్రీడాకారుడు యలమంచి కిరణ్ శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు తమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చని, లేదంటే నేరుగా తుమ్మలచెరువు వద్దకు వెళ్లి సంప్రదించవచ్చని వివరించారు. వివరాలకు తమ కార్యాలయ సిబ్బంది లక్ష్మయ్య(99661 25087), కోచ్ యలమంచి కిరణ్ (94945 97083)ను సంప్రదించాలని సూచించారు.
27న కొత్తగూడెం
‘బార్’ ఎన్నికలు
నామినేషన్లకు నేడు తుది గడువు
కొత్తగూడెంటౌన్: కొత్తగూడెం బార్ అసోసియేషన్ ఎన్నిక ఈనెల 27న నిర్వహించనున్నట్లు సీఈఓ పలివేల గణేష్‌బాబు తెలిపారు. బరిలో నిలిచే అభ్యర్థులు గురువారం వరకు నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉందని చెప్పారు. స్థానిక కోర్టులో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, జనరల్ సెక్రటరీ, మహిళా రిప్రజెంటేటివ్, లైబ్రరీ సెక్రటరీ, ట్రెజరర్, స్పోర్ట్స్, కల్చరల్ సెక్రటరీ పదవులకు ఎన్నికలు జరగనున్నాయని వివరించారు. ఈనెల 17 నుంచి నామినేషన్లు స్వీకరిస్తుండగా బుధవారం నాటికి 34 మంది దాఖలు చేశారని తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణకు 22 వరకు గడువు ఉంటుందని, అదేరోజు సాయంత్రం 4 గంటలకు బరిలో ఉండేవారి పేర్లు ప్రకటిస్తామని చెప్పారు. సమావేశంలో సహాయ ఎన్నికల అధికారులు ఎర్రపాటి కృష్ణ, పాల రాజశేఖర్ పాల్గొన్నారు.
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం