సూపర్‌బజార్(కొత్తగూడెం): రాజకీయ పార్టీల నాయకులకు ఓటరు జాబితాపై పూర్తి అవగాహన ఉండాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు శనివారం ఆయన ఐడీఓసీలో ఆయా పార్టీల నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నూతన ఓటర్ల నమోదు, జాబితాలో తప్పుల సవరణ, ఓటర్ల తొలగింపు తదితర అంశాలపై అవగాహన అవసరమని తెలిపారు. ఫామ్ 6 దరఖాస్తు ద్వారా కొత్తగా ఓటు కోసం, ఫామ్ 7 ద్వారా తొలగింపు, అభ్యంతరాలపై దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆయా దరఖాస్తులను బీఎల్‌ఓలు విచారించిన తర్వాతే పేర్లు తొలగిస్తామని చెప్పారు. తప్పుల సవరణ, ఫొటో మార్పు, ఓటు బదిలీ తదితర సేవలకు ఫామ్ 8 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రాజకీయ పార్టీలు కూడా బూత్ లెవల్ ఏజెంట్లను నియమించాలన్నారు. పోలింగ్ బూత్‌లు, ఓటరు జాబితాలో ఏదైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తెస్తే పరిష్కరిస్తామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఫామ్ 6,7,8 లలో 19,514 దరఖాస్తులు వచ్చాయని, వాటిలో 10,944 దరఖాస్తులను పరిష్కరించామని, 1,310 దరఖాస్తులు తిరస్కరించామని, 7,260 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని వివరించారు. నూతన ఓటుహక్కు రిజిస్ట్రేషన్, మార్పులు చేర్పుల కోసం ఎక్కడికీ తిరగాల్సిన అవసరం లేకుండా బీఎల్‌ఓ యాప్ ద్వారా అన్ని సేవలూ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ యాప్‌పై వచ్చే శనివారం శిక్షణ ఉంటుందన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, ఎన్నికల సూపరింటెండెంట్ దారా ప్రసాద్, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
వంట చేసిన కలెక్టర్..
దమ్మపేట : ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్‌పై స్వయంగా వంట చేసిన కలెక్టర్ జితేష్ వి.పాటిల్ కుక్కర్ వినియోగంపై ఆదివాసీ మహిళలకు అవగాహన కల్పించారు. మండలంలోని కొండరెడ్ల గ్రామమైన పూసుకుంటను శనివారం రాత్రి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ వినియోగం, వంట సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రవీంద్రరెడ్డి, ఇన్‌చార్జ్ తహసీల్దార్ కె.వాణి తదితరులు పాల్గొన్నారు.
రాజకీయ పార్టీల నేతలకు కలెక్టర్ సూచన