ఇసుక అక్రమాలపై అధికారుల తీరుకు రైతుల నిరసన
చీరాల: తాము వచ్చేసరికి ఇక్కడ తవ్వకాలు జరగడం లేదని, యంత్ర పరికరాలు లేవంటూ మైనింగ్ అధికారులు రిపోర్టు రాయడంపై రైతులు బుధవారం నిరసన తెలిపారు. ఇసుక అక్రమదారులకు అధికారులు కూడా వత్తాసు పలుకుతున్నారని మరోసారి రుజువైందని రాష్ట్ర కౌలు సంఘం జిల్లా కార్యదర్శి పి.కొండయ్య అన్నారు.
చీరాల మండలం కావూరివారిపాలెం పంచాయతీ పరిధిలోని రాయల్ మైరెన్ కంపెనీ సమీపంలో సర్వే నెంబర్ 529, 689, 685 వ్యవసాయ భూముల్లో అక్రమంగా ఇసుక తవ్వకాల వలన పెద్ద గోతులు ఏర్పడి పంట పొలాల్లో నీరు నిలవక 2 వేల ఎకరాల్లో పంట తీవ్రంగా దెబ్బతింటుందని, పంట కాలువలను కూడా పూడ్చేశారన్నారు. పూర్వం ప్రభుత్వం పేదలకు ఇచ్చిన భూములని, అక్రమ ఇసుక తవ్వకాలను ఆపాలని గత నెల 8న కావూరివారిపాలెం రైతులు గ్రీవెన్స్‌సెల్‌లో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందించారన్నారు. బుధవారం మైనింగ్ అధికారులు కావూరివారిపాలెం, వెదుళ్ళపల్లి వీఆర్వోలతో పరిశీలనకు వచ్చారన్నారు. అధికారులను చూసి అక్రమ ఇసుక వ్యాపారులు పరారయ్యారన్నారు. ఒక టిప్పర్ అక్కడే ఉండగా మరో ఆరు టిప్పర్లు బాపట్ల రోడ్డుపై పెట్టుకున్నారన్నారు. క్వారీ లోపల రెండు పొక్లెయినర్లు, పక్కనే చెట్ల చాటున మరో రెండు పొక్లెయినర్లు, ఒక జనరేటర్, గుడిసెలు, కుర్చీలు, మంచాలు ఉన్నాయన్నారు. అధికారులు ఇవి రిపోర్టులో పేర్కొనకుండా ఎలాంటి యంత్ర పరికరాలు లేవని రాయడంపై రైతులు తప్పుబట్టారన్నారు. పికెటింగ్ ఏర్పాటు చేసి పోలీసులు చర్యలు తీసుకోవాలని మాత్రమే రాశారన్నారు. అక్కడకు తాము వచ్చేసరికి మైనింగ్ జరగడం లేదు.. కాబట్టి ఇలానే రాస్తామని మైనింగ్ టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ రైతులతో వాదనకు దిగారన్నారు. రిపోర్టుపై రైతులు సంతకాలు చేయబోమని చెప్పి నిరసన తెలిపారన్నారు. గత వారం రోజులుగా ఈ పరిస్థితి నెలకొందని, ఇసుక అక్రమ తవ్వకాలు నిలిపివేసి తమ పంటలను కాపాడాలని రైతులు కోరారు. గ్రామ రైతులు దేవల రమణయ్య, దానియేలు, బలగాని సాంబయ్య, కాటి దేవదానం, దేవుళ్ళ శ్రీను, లూథర్ తదితరులు పాల్గొన్నారు.


