ట్రాఫిక్‌ విధులు సమర్థంగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్‌ విధులు సమర్థంగా నిర్వహించాలి

Jun 7 2026 3:51 AM | Updated on Jun 7 2026 3:51 AM

జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్‌

ట్రాఫిక్‌ పోలీసులకు ప్రత్యేక కిట్లు పంపిణీ

బాపట్లటౌన్‌: ట్రాఫిక్‌ విధులు సమర్థంగా నిర్వహించాలని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్‌ తెలిపారు. జిల్లాలోని ట్రాఫిక్‌ పోలీసులతో శనివారం క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. తొలుత ట్రాఫిక్‌ సిబ్బందికి ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకొని వారికి ప్రత్యేక కిట్లు అందజేశారు. ఎస్పీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ట్రాఫిక్‌ సిబ్బంది కీలకమన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే 20 శాతం తగ్గింపే లక్ష్యంగా విధులు నిర్వర్తిస్తున్నామన్నారు. రోడ్డు ప్రమాదం వల్ల సంభవించే ప్రతి ఒక్క మరణం ఆ వ్యక్తితో ముగిసిపోదు, ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తుందన్నారు. ట్రాఫిక్‌ సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఎండ తీవ్రత నుంచి రక్షణ పొందేందుకు ప్రత్యేక టోపీ, కళ్లకు కూలింగ్‌ గ్లాసెస్‌, ధూళి నుంచి రక్షణకు మాస్కులు, డీహైడ్రేషన్‌ బారిన పడకుండా ఉండేందుకు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను అందజేశామన్నారు. సామాన్య ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికే భయపడుతున్న పరిస్థితుల్లో కూడా ట్రాఫిక్‌ సిబ్బంది ఎండను, ధూళిని లెక్కచేయకుండా విధులు నిర్వహించడం అభినందనీయమన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ఈ కిట్‌ ట్రాఫిక్‌ సిబ్బందికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. రోడ్డు ప్రమాదాల వల్ల సంభవించే మరణాలను తగ్గించాలనే ఉద్దేశంతో ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా ‘శిరో రక్ష – ప్రాణ రక్ష‘ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామన్నారు. ప్రతిరోజూ విధుల్లో ఉండే ట్రాఫిక్‌ సిబ్బంది ఈ కార్యక్రమం ఉద్దేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో బాపట్ల డీఎస్పీ సీహెచ్‌.చంద్రమౌళి, ఎస్‌బీ–2 ఇన్‌స్పెక్టర్‌న ఎం.రాంబాబు, బాపట్ల టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆర్‌.రాంబాబు, ఎస్సీ, ఎస్టీ సెల్‌ ఇన్‌స్పెక్టర్‌ బాలనాగిరెడ్డి, అడ్మిన్‌ ఆర్‌ఐ షేక్‌.మౌలుద్దీన్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement