కొత్త పింఛన్లు ఇచ్చేదెన్నడో?
వేటపాలెం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలవుతున్నా నేటికీ ఒక్క సంక్షేమ పథకం కూడా సమర్థంగా అమలు చేసిన దాఖలాల్లేవు. చివరకు ఏ దిక్కూ లేని వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు కూడా పింఛన్లు మంజూరు చేయడం లేదు. పలువురు అర్హులు ఎప్పుడు పింఛన్ మంజూరు చేస్తారంటూ సచివాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఇటీవల స్పౌజ్ కేటగిరిలో పింఛన్లను ప్రభుత్వం మంజూరు చేసింది. పింఛన్ పొందుతున్న భర్త చనిపోతే మాత్రమే భార్యకు ఆ పింఛన్‌ను బదిలీ చేస్తున్నారు. అసలు పింఛన్ రాని వ్యక్తి చనిపోతే ఆయన భార్యకు ఇవ్వాల్సిన వితంతు పింఛనుకు మొండి చేయి చూపిస్తున్నారు. వివిధ సామాజిక పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారిని పట్టించుకోవడం లేదు. బాపట్ల జిల్లాలో ప్రస్తుతం 2,27,868 మంది సామాజిక పెన్షన్‌దారులు ఉన్నారు. చీరాల నియోజకవర్గం పరిధిలో 30,239 మంది ఉండగా వీరిలో చీరాల అర్బన్ పరిధిలో 8,093 మంది, రూరల్ పరిధిలో 11,438 మంది, వేటపాలెం మండలం పరిధిలో 10,718 మంది సామాజిక పింఛన్లు పొందుతున్నారు.
అమలు కాని ఎన్నికల హామీ..
ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన వారికి 50 ఏళ్లకే పింఛన్ అందజేస్తామని హామీ ఇచ్చింది. ఇంత వరకు దీనిని ఆచరణలో పెట్టలేదు. ఎప్పటి నుంచి అమలు చేస్తుందో కూడా ప్రకటించలేదు. దీంతో జిల్లాలో అర్హులైన వితంతువులు, దివ్యాంగులు, వృద్ధులు, కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రతి రోజూ సామాజిక పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి సచివాలయానికి వస్తున్నారు. ఇంకా ఎలాంటి ఆదేశాలు రాలేదని వారికి సచివాలయ సిబ్బంది సమాధానం చెబుతుండటంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎక్కువ శాతం పింఛన్ మంజూరు చేయమని అర్జీలు అందిస్తున్నారు.
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకున్న ఆరు నెలల్లోనే కొత్త పింఛన్లు మంజూరయ్యేవి. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగేది. నేడు ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఆ పరిస్థితి లేకుండా ప్రస్తుత ప్రభుత్వం పెన్షన్‌కు సంబంధించి వెబ్‌సైట్ నిలిపేయడంతో అర్హులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అర్హులైన వారు నిత్యం గ్రామ, వార్డు సచివాలయాల చుట్టూ తిరగలేక ఇబ్బంది పడుతున్నారు. పింఛన్ల మంజూరులో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అనుసరించిన విధానమే సరైందని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. వలంటీర్ వ్యవస్థ ద్వారా పింఛన్‌దారులకు ఇంటి వద్దే పింఛను అందించేవారు. భర్త చనిపోయిన వారికి వితంతు పింఛన్లు మరుసటి నెలలోనే మంజూరు చేసేలా చర్యలు తీసుకునేవారు. అదే విధంగా ఏడాదికి రెండు సార్లు కొత్త పింఛన్లు మంజూరుకు అవకాశం కల్పించేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితులు లేకపోవడంతో అర్హులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


