పని ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపులు అరికట్టాలి
బాపట్ల: పని ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపులను అరికట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ తెలిపారు. పని ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ చట్టంపై అవగాహన కల్పిస్తూ సార్డ్స్ సంస్థ రూపొందించిన గోడపత్రాలను కలెక్టర్ శుక్రవారం విడుదల చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ సంఘటిత, అసంఘటిత రంగాలలో పనిచేసే మహిళలకు భద్రత కల్పించడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. పదిమంది అంతకుమించి ఉద్యోగులు, కార్మికులు పనిచేస్తుంటే ఆ ప్రాంతంలో అంతర్గత కమిటీలను నియమించాలన్నారు. మహిళలపై లైంగిక వేధింపులు నివారణ, నిషేధం, పరిష్కార మార్గంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా
నిర్మూలించాలి
బాల కార్మిక వ్యవస్థను జిల్లాలోని అధికారులు పూర్తిగా నిర్మూలించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్‌కుమార్ ఆదేశించారు. బాల కార్మిక నిర్మూలన జిల్లా స్థాయి కమిటీ సమావేశం శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లో నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ బాల కార్మిక నిర్మూలన చట్టాలు పకడ్బందీగా అమలు చేయాలని తెలిపారు. బాపట్ల జిల్లాలో బాల కార్మికులు ఉండరాదన్నారు. రెస్క్యూ బృందాలు నిరంతరం తనిఖీలు చేయాలన్నారు.
అసంఘటిత రంగ కార్మికులకు
ప్రభుత్వ సంక్షేమ పథకాలు
అసంఘటిత రంగ కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా ప్రయోజనాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ తెలిపారు. ఇ–శ్రమ పోర్టల్ అమలు తీరు, కార్మిక శాఖ పన్నుల వసూళ్లపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లో నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇ–శ్రమ పోర్టల్‌లో కార్మికులందరి పేర్లు నమోదు చేయించాలని అన్నారు. జిల్లాలో 3.54 లక్షల మంది కార్మికులను ఇ–శ్రమ పోర్టల్‌లో చేర్పించాలని లక్ష్యం కాగా, ఇప్పటివరకు 1.93 లక్షల మంది వివరాలు నిక్షిప్తం చేశామన్నారు.
పన్నుల వసూళ్లు వేగవంతం చేయండి
అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ ఫలాలు అందించడానికి పన్నులు పక్కాగా వసూలు చేయాలని కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ తెలిపారు. జిల్లా పరిషత్, ఆర్‌డబ్ల్యూఎస్ (గ్రామీణ నీటి సరఫరా విభాగం), మున్సిపాలిటీలలో చేపట్టిన మౌలిక సదుపాయాల పనులపై చట్ట ప్రకారం పన్నుల రూపంలో రూ.1.25 కోట్లు కార్మిక శాఖకు వచ్చిందన్నారు. మున్సిపాలిటీలలో చేపట్టిన అభివృద్ధి పనులు, వివిధ రకాల పన్నుల ద్వారా కార్మిక శాఖకు రూ.13.33 కోట్లు వచ్చాయన్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ రంగాలలో చేపట్టిన 8,904 పనులకు గాను పన్నుల రూపంలో రూ.10.06 కోట్లు వసూలు జరిగాయన్నారు.
జిల్లాలో ఉన్న ప్రతి చిన్నారి ఆరోగ్యంగా ఉండేలా వైద్య అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ ప్రాంగణంలో బాలల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేకంగా రూపొందించిన ‘బాలల సంపూర్ణ ఆరోగ్య రక్ష’ వాహనాన్ని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉన్న ప్రతి చిన్నారి ఆరోగ్యంగా ఉండేలా వైద్య అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్


