రోడ్డు ప్రమాదంలో జర్నలిస్ట్ ప్రశాంత్‌రాజు మృతి
బాపట్ల/కర్లపాలెం: విశాలాంధ్ర తెలుగు దినపత్రిక బాపట్ల జిల్లా బ్యూరో కాగిత ప్రశాంత్ రాజు (36) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. సోమవారం విధులు పూర్తిచేసుకుని కర్లపాలెంలోని తన నివాసానికి బైక్‌పై వెళుతుండగా నల్లమోతువారిపాలెం వద్ద ఆక్వా సీడ్స్ లారీ ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన తరువాత అదే మార్గంలో లో వెళుతున్న బాపట్ల దిశ రిపోర్టర్ బడుగు విజయ భరత్ ప్రమాదానికి గురైన ప్రశాంత్‌ను 108లో బాపట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్య సౌకర్యాలు లేని కారణంగా రెండు గంటలపాటు కొన ఊపిరితో పోరాడి చివరకు తుది శ్వాస విడిచారు. జర్నలిస్ట్ ప్రశాంత్ రాజుకు భార్య, ఒక పాప, బాబు ఉన్నారు.
మృతికి కోన సంతాపం
ప్రశాంత్‌రాజు మృతికి మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి సంతాపం తెలిపారు. జర్నలిస్టుగా విశేష సేవలు అందించిన ప్రశాంత్‌రాజు మృతి తీరనిలోటన్నారు. ప్రశాంత్‌రాజు కుటుంభ సభ్యులకు సానుభూతి తెలిపారు. సంతాపం తెలిపినవారిలో మాజీ ఎమ్మెల్యే చీరాల గోవర్ధన్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి చేజర్ల నారాయణరెడ్డి, జర్నలిస్టు నాయకులు సంతాపం తెలిపారు. ప్రశాంత్‌రాజు భౌతికకాయాన్ని కర్లపాలెం ఎంపీపీ యారం వనజ, సర్పంచి నక్కల శేషాద్రి, పలువురు ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు సందర్శించి నివాళులర్పించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రవీంద్ర తెలిపారు.
బాపట్లలో అలముకున్న విషాదం


