ఏఐకేఎస్ జాతీయ కౌన్సిల్ సమావేశాలను జయప్రదం చేయండి
మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): ఈనెల 29, 30, 31, ఫిబ్రవరి 1న గుంటూరులోని టీటీడీ కల్యాణ మండపంలో జరిగే ఏఐకేఎస్ జాతీయ కౌన్సిల్ సమావేశాలను జయప్రదం చేయాలని ఆహ్వాన సంఘం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు పిలుపునిచ్చారు. గుంటూరు అరండల్ పేటలోని ఓ హోటల్ లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో లక్ష్మణరావు, ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి.కృష్ణయ్య, కె.ప్రభాకర్ రెడ్డి, సుందరయ్య కళా నిలయం అధ్యక్షుడు ముత్తవరపు సురేష్ బాబులు మాట్లాడారు. గుంటూరు టీటీడీ కళ్యాణ మండపంలో ఏఐకేఎస్ జాతీయ కౌన్సిల్ సమావేశాలు జరుగుతున్నాయన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి, ఢిల్లీ రైతు ఉద్యమంతో సహా వివిధ రైతాంగ ఉద్యమాలలో పాల్గొన్న 300 మంది రైతునాయకులు వస్తున్నారన్నారు. అదేవిధంగా ఆయా రోజుల్లో శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో వ్యవసాయ ఎగ్జిబిషన్, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. రిటైర్డ్ ప్రొఫెసర్ టి.రత్నారావు, ప్రొఫెసర్ ఎన్.వేణుగోపాలరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కె.అజయ్ కుమార్, కౌలు రైతుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పాశం రామారావు తదితరులు పాల్గొన్నారు.


