సహాయక పరికరాలు సద్వినియోగం చేసుకోవాలి
పర్చూరు(చినగంజాం): కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దివ్యాంగులకు అందజేస్తున్న సహాయక పరికరాలను సద్వినియోగం చేసుకోవాలని విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ అసిస్టెంట్ డైరక్టర్ సువార్త అన్నారు. మండల కేంద్రమైన పర్చూరులోని జెడ్పీ హైస్కూల్‌లో సోమవారం జిల్లా దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు సహాయక పరికరాల నమోదు శిబిరం నిర్వహించారు. సహాయ పరికరాలు లేని వారికి అలిన్కో సంస్థ తయారు చేసిన పరికరాలను అందజేసే మఖ్య ఉద్దేశంతో శిబిరాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శిబిరానికి 150 మంది విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులు హాజరు కాగా 120 మందికి సహాయ పరికరాలు అవసరమవుతాయని గుర్తించినట్లు తెలిపారు. సహాయ పరికరాలను ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. వైకల్యం 80 శాతం పైబడిన వారికి బ్యాటరీతో కూడిన ట్రైసైకిల్, వినికిడి పరికరాలు, చేతికర్రలు, వీల్‌చైర్‌లు ఉచితంగా అందజేస్తున్నట్లు తెలిపారు. డాక్టర్ ప్రత్యూష వికలాంగుల ధ్రువపత్రాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వి. ప్రద్యుమ్నకుమార్, ఎంఈఓలు శివకోటేశ్వరరావు, వెంకటరామయ్య పాల్గొన్నారు.
విభిన్న ప్రతిభావంతుల సంక్షేమశాఖ
అసిస్టెంట్ డైరెక్టర్ సువార్త


