26 నుంచి గిత్తల ప్రదర్శన పోటీలు
రెంటచింతల: ఫిబ్రవరి 2న నిర్వహిస్తున్న స్థానిక కానుకమాత చర్చి 176వ తిరునాళ్ల మహోత్సవాన్ని పురస్కరించుకని ఈ నెల 26 నుంచి ఫిబ్రవరి 4వ తేదీ వరకు జాతీయ స్థాయి ఒంగోలు జాతి గిత్తల ప్రదర్శన పోటీలను నిర్వహించనున్నారు. సెయింట్ జోసఫ్స్ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో కార్యక్రమం ఉంటుందని ఆదివారం క్రీడామైదానంలో ఏర్పాట్లను పర్యవేక్షించిన అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ప్రదర్శన కమిటీ సభ్యులు తెలిపారు. వారు మాట్లాడుతూ.. 26న టచ్ పళ్ల, 27న రెండు పళ్ల, 28న నాలుగు పళ్ల, 29న ఆరు పళ్ల, 30న న్యూ కేటగిరీ, 31న సబ్ జూనియర్ విభాగాలలో పోటీలు ఉంటాయన్నారు. ఫిబ్రవరి 1వ తేదీన జూనియర్స్, ఫిబ్రవరి 3న సీనియర్స్ విభాగంలో పోటీలు ఏర్పాటు చేశామని తెలిపారు. మొత్తం 8 విభాగాలలో 9 బహుమతుల చొప్పున రైతు సోదరులకు రూ. 28 లక్షల బహుమతులు అందించనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో నిర్వాహకులు మాజీ వైస్ ఎంపీపీ గొంటు సుమంత్‌రెడ్డి, గాదె కస్పాల్‌రెడ్డి, బొడపాటి రామకృష్ణ, ఏరువ జోజిరెడ్డి, ఓరుగంటి ఇన్నారెడ్డి, మూలి రాజారెడ్డి, మొండెద్దు చిన్న శౌర్రెడ్డి, కొమ్మారెడ్డి జోసఫ్‌రెడ్డి, ఏరువ ఫాతిమా మర్రెడ్డి, బోయపాటి జోజిరెడ్డి తదితరులు ఉన్నారు.
రొంపిచర్ల: ‘ఫోన్ పే చేస్తాం.. పెట్రోల్ కొట్టండి’ అంటూ బంక్‌లోని ఆపరేటర్ వెంకట కృష్ణపై దుండగులు దౌర్జన్యం చేసిన సంఘటన మండల కేంద్రమైన రొంపిచర్ల సమీపంలోని ఓ బంక్‌లో చోటుచేసుకుంది. అతడిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో బాధితుడి తలకు తీవ్రగాయాలు అయ్యాయి. వివరాలు... శనివారం రాత్రి కారులో ముగ్గురు వ్యక్తులు పెట్రోల్ బంక్‌లోకి వచ్చారు. వారిలో ఒకడు వచ్చి ఆపరేటర్‌తో రూ.5 వేలు ఫోన్ పే చేస్తామని చెప్పాడు. రూ. 2 వేలకు పెట్రోల్ కొట్టి, రూ.3 వేలు నగదు ఇవ్వాలని అడిగాడు. ఫేక్ మెసేజ్ చూపాడు. పెట్రోల్ పోయించుకున్నాక, రూ.3 వేలు నగదు అడిగాడు. తనకు మెసేజ్ రాలేదని, స్కానర్‌తో డబ్బు పంపాలని ఆపరేటర్ చెప్పారు. ఇంతలో కారులోని మరో ఇద్దరు వచ్చి ఆపరేటర్ మెడలో ఉన్న డబ్బు సంచి లాక్కున్నారు. ఆపరేటర్ సంచి పట్టుకొని వదలకుండా వారితో పెనుగులాడాడు. కారులో వెంకట కృష్ణను బలవంతంగా ఎక్కించి తీసుకుపోయేందుకు ప్రయత్నించారు. ఇంతలో వేరేవారు అటుగా రావడంతో దుండగులు అతడిని కారులో నుంచి బయటకు నెట్టి పరారయ్యారు. ఈ పెనుగులాటలో వెంకటకృష్ణ ఫోన్ కారులో పడిపోయింది. అతడి తలకు గాయాలు అయ్యాయి. నరసరావుపేట వైద్యశాలలో అతడు చికిత్స పొందుతున్నారు. ఇదే తరహాలో నకరికల్లులో కూడా ఓ బంక్‌లో ఇదే ముఠా రూ.5 వేలను కాజేసినట్లు సమాచారం.
సత్తెనపల్లి: అప్పుల బాధతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లి పాతబస్టాండ్ సమీపంలోని శ్రీకృష్ణా లాడ్జిలో ఆదివారం వెలుగు చూసింది. వివరాలు... గుంటూరు జిల్లా తెనాలి మండలం తేలప్రోలు గ్రామానికి చెందిన షేక్ అబ్దుల్ అజీజ్ (31) గత కొన్ని సంవత్సరాలుగా వెండి వస్తువులు చేస్తున్నాడు. ఈ క్రమంలో కొంత అప్పులయ్యాయి. తీరే మార్గం కనిపించక మనస్తాపం చెందిన అబ్దుల్ అజీజ్ ఈ నెల 9న సాయంత్రం సత్తెనపల్లిలోని శ్రీకృష్ణా లాడ్జిలో గది అద్దెకు తీసుకుని ఉన్నాడు. శనివారం రాత్రి నుంచి తలుపు తీయకపోవడంతో ఆదివారం ఉదయం అనుమానం వచ్చి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ జె.రాజశేఖర్, సిబ్బంది వచ్చి డోర్ పగలగొట్టి చూడగా ఫ్యాన్‌కు దుప్పటితో అతడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. అతడి చెయ్యి విరగడంతో 3 నెలల నుంచి చికిత్స నిమిత్తం నరసరావుపేట వైద్యశాలకు వెళ్లడం కోసం హైదరాబాద్ నుంచి ట్రైన్‌లో వస్తూ ఈ లాడ్జిలో బస చేస్తున్నాడు. పర్సులో చిన్న పేపర్ ఉంది. అందులో ‘లాడ్జి ఓనర్ గారు.. నన్ను క్షమించండి. కొందరి అప్పులు సెటిల్ చేయండి, నన్ను క్షమించండి, ఇల్లు కూడా అమ్ముకున్నాను.’ అని రాసి ఉంది. పట్టణ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
సత్తెనపల్లి: కడుపు నొప్పి తాళలేక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఆదివారం జరిగింది. వివరాలు... పట్టణంలోని వెంకటపతి నగర్ 3వ లైన్‌కు చెందిన జగన్నాథం హనుమయ్య (48) రెండు సంవత్సరాలుగా కడుపునొప్పితో బాధపడుతూ చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
26 నుంచి గిత్తల ప్రదర్శన పోటీలు
26 నుంచి గిత్తల ప్రదర్శన పోటీలు


