ఆకట్టుకున్న ఆవుల పోటీలు
గన్నవరం: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆవరణలో ఆదివారం శ్రీలక్ష్మీనరసింహా సంక్రాంతి సంబరాల్లో భాగంగా జాతీయ స్థాయిలో ఆవుల అందాల పోటీలను నిర్వహించారు. తొలుత ఈ పోటీలను ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రారంభించారు. పోటీల్లో పాల్గొనేందుకు ఏపీ, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల నుంచి ఆవులను తీసుకువచ్చారు. వెంకట్రావు మాట్లాడుతూ.. అంతరించిపోతున్న మన జాతి సంపదైన పుంగనూరు, ఒంగోలు, కపిల పశువులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా రైతులను పోత్సాహించేందుకు జాతీయ స్థాయిలో పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం ఈ పోటీల్లో గెలుపొందిన పశువులకు సంబంధించిన యాజమానులకు 6.50 లక్షల నగదు బహుమతులను అందజేశారు. అనంతరం ముగ్గుల పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను పంపిణీ చేశారు. పోటీల నిర్వాహకులు కాసరనేని రాజా, ఏఎంసీ చైర్మన్ గూడవల్లి నరసింహారావు, గన్నవరం ఇన్‌చార్జ్ సర్పంచ్ పాలడుగు నాని, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త చలమలశెట్టి రమేష్, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి, మాజీ సర్పంచ్ గూడపాటి తులసిమోహన్ పాల్గొన్నారు.
పోటీల్లో విజేతల వివరాలు..
ఈ పోటీల్లో ఒంగోలు జాతి పళ్లు కలిపిన ఆవుల విభాగంలో ఏలూరు జిల్లాకు చెందిన అడపా శ్రీనివాసరావు మొదటి స్థానం, బాపట్ల జిల్లా ఇస్రంపేటకు చెందిన తువ్వాటి బాలకృష్ణ, తిమ్మరాజుపాలెంకు చెందిన నర్రా సుబ్బారావు ఆవులు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. ఒంగోలు జాతి ఆరు పళ్ల విభాగంలో బాపట్ల జిల్లా దేవరపల్లికి చెందిన ముప్పాళ్ల నాగేశ్వరరావు ఆవు విజేతగా, కంకిపాడుకు చెందిన వట్టి కృష్ణయ్య, పల్నాడు జిల్లా లింగారావుపాలెంకు చెందిన కనపర్తి సుబ్బారావు ఆవులు ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించాయి. నాలుగు పళ్ల విభాగంలో కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం పమిడిగుంటపాలెంకు చెందిన మైనేని వంశీకృష్ణ మొదటి స్థానం, గుంటూరులోని స్వర్ణభారతినగర్‌కు చెందిన నల్లమేకల సతీష్, అరండల్‌పేటకు చెందిన పసుపులేటి కృష్ణ ఆవులు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. ఒంగోలు జాతి రెండు పళ్ల విభాగంలో పెనమలూరుకు చెందిన కిలారు వెంకటేశ్వరరావు ఆవు, టచ్ పళ్లు(పళ్ళు కలిపిన ఆవులు) విభాగంలో పశ్చిమ గోదావరి జిల్లా చామవరానికి చెందిన బర్రెడ్డి మణికంఠ సతీష్ ఆవు విజేతగా, పుంగనూరు జాతిలో కోనసీమ జిల్లా రాజోలుకు చెందిన అడపా లక్ష్మీనారాయణ, కపిల జాతిలో తూర్పుగోదావరి జిల్లా మండపేటకు చెందిన వల్లూరి శ్రీనివాస్‌కు చెందిన ఆవులు విజేతలుగా నిలిచాయి.


