అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు
బాపట్ల టౌన్: పట్టణంలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని బాపట్ల డీఎస్పీ జి. రామాంజనేయులు తెలిపారు. పట్టణంలోని రైలుపేటలో ఆదివారం బాపట్ల డీఎస్పీ నేతృత్వంలో సబ్ డివిజన్ పరిధిలోని పోలీసుల ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ జి. రామాంజనేయులు మాట్లాడుతూ రైలుపేటలోని అసాంఘిక కార్యకలాపాలకు అవకాశం ఉన్న ప్రాంతాలు, అనుమానితుల నివాసాలు తనిఖీ చేశామన్నారు. 90 మంది పోలీసులు పాల్గొన్నారన్నారు. సరైన ధ్రువపత్రాలు లేని 51 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో స్వాధీనం చేసుకున్నామన్నారు. ప్రతి ఇంటిలో నివసిస్తున్న వ్యక్తుల వివరాలు, ఆధార్ కార్డులను తనిఖీ చేశామన్నారు. వాహనదారులు తప్పనిసరిగా ధ్రువపత్రాలు కలిగి ఉండాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే వాహనాలను సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు సంప్రదాయ క్రీడలు, ఎడ్ల పందేలు వంటి పోటీలను చట్టపరిధిలో నిర్వహించుకోవాలని సూచించారు. పేకాట, కోడిపందేలు వంటి జూద క్రీడలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం ప్రజలు గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలనే అంశంపై స్థానికులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల టౌన్ సీఐ రాంబాబు, బాపట్ల రూరల్ సీఐ శ్రీనివాసరావు, బాపట్ల రూరల్ సర్కిల్ సీఐ హరికృష్ణ, సబ్‌డివిజన్ పరిధిలోని ఈగల్ టీమ్, సబ్ డివిజన్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
బాపట్ల పట్టణంలో కార్డెన్ సెర్చ్


