మనిషినే సరుకుగా మార్చిన నేటి ఆర్థిక వ్యవస్థ
గుంటూరుఎడ్యుకేషన్: ఆర్థిక అసమానతలతో సమాజంలో తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని, సరుకులకే విలువున్న నేటి సమాజంలో మనిషి సరుకుగా మారి విలువ కోల్పోయాడని ఆర్థిక రంగ విశ్లేషకులు డి.పాపారావు అన్నారు. ఉపాధ్యాయ ఉద్యమ సారథి నూతలపాటి పరమేశ్వరరావు వర్ధంతి సందర్భంగా ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఆదివారం ఏసీ కళాశాలలో విద్యాసదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న పాపారావు ‘విద్య ప్రైవేటీకరణ – ఆర్థిక అసమానతలు‘ అనే అంశంపై మాట్లాడుతూ పెట్టుబడి దారీ వ్యవస్థ లో యజమాని కార్మిక శ్రమ దోపిడీతో లాభాలు గడిస్తూ, కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించలేని స్థితిలో ఉన్నారని అన్నారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేస్తున్నప్పటికీ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ప్రతి ఏటా తగ్గుతున్నారన్నారు.
– ఏపీటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చెన్నుపాటి మంజుల, కె.భానుమూర్తి మాట్లాడుతూ 12వ పీఆర్సీ, డీఏ విడుదల, పెండింగ్ బకాయిలు, సీపీఎస్ రద్దు అంశాలను వెంటనే పరిష్కరించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు కూలిసంఘం అధ్యక్షులు సింహాద్రి ఝాన్సీ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక విధానాలతో ముందు కు వెళుతూ అన్ని వ్యవస్థలను ధ్వంసం చేస్తు న్నాయని ఆరోపించారు. నూతలపాటి పరమేశ్వరావు అమరుడై నాలుగేళ్లు గడిచాయని ఆయన ఆలోచన అవగాహనతో పనిచేసినప్పుడే అతనికిచ్చే ఘన నివాళి అని వక్తలు కొనియాడారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ మాజీ ఎమ్మెల్సీ పాకాలపాటి రఘు వర్మ, ఉపాధ్యాయ పత్రిక ప్రధాన సంపాదకులు షేక్ జిలాని, పూర్వ ప్రధాన కార్యదర్శి పి.పాండురంగ వరప్రసాదరావు, ఓపీడీఆర్ రాష్ట్ర కార్యదర్శి వి.హనుమంతరావు, ఏపీటీఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యులు, ఏపీటీఎఫ్ గుంటూరు జిల్లా శాఖ అధ్యక్షుడు కె.బసవలింగారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఖాలీద్, ఉపాద్యాయులు తదితరులు పాల్గొన్నారు.
ఏపీటీఎఫ్ సదస్సులో
ఆర్థిక రంగ విశ్లేషకులు డి.పాపారావు


