ప్రతిభావంతులు సమాజాభివృద్ధికి తోడ్పాటు అందించాలి
●సీసీఎల్ ఇండియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాజేంద్రప్రసాద్
●442 మంది విద్యార్థులకు రూ.61.82 లక్షలు ఉపకార వేతనాలు పంపిణీ
గుంటూరు ఎడ్యుకేషన్: దాతల సహకారంతో ఉపకార వేతనాలు పొందిన విద్యార్థులు ఉన్నతస్థాయికి చేరుకున్నాక సమాజాభివృద్ధికి తోడ్పాటు అందించాలని సీసీఎల్ ఇండియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సీహెచ్ రాజేంద్రప్రసాద్ అన్నారు. ఆదివారం జేకేసీ కళాశాలరోడ్డులోని డాక్టర్ కేఎల్‌పీ పబ్లిక్ స్కూల్లో శ్రీ కాకతీయ స్టూడెంట్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో 23వ ఉపకార వేతన పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాజేంద్రప్రసాద్, సొసైటీ ప్రతినిధులు రూ.442 మంది ఇంజినీరింగ్, మెడిసిన్, ఫార్మసీ, నర్సింగ్, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు రూ.61.82 లక్షల ఉపకార వేతన చెక్కులను పంపిణీ చేశారు. ముందుగా సొసైటీ వ్యవస్థాపకులు జాస్తి వెంకటేశ్వర్లు, పుట్టగుంట వేణుగోపాల్‌రావు చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు.
– సొసైటీ ప్రెసిడెంట్ పాలడుగు లక్షణరావు మాట్లాడుతూ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు అందించే లక్ష్యంతో సొసైటీ పని చేస్తోందన్నారు. సొసైటీ ప్రతినిధి నామినేని కోటేశ్వరరావు మాట్లాడుతూ శ్రీ కాకతీయ స్టూడెంట్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో గత 23ఏళ్లలో 6,923 మంది విద్యార్థులకు రూ.7.50 కోట్ల మేరకు ఉపకార వేతనాలు పంపిణీ చేశామని, దీనిని ప్రతి యేటా కొనసాగిస్తామని చెప్పారు. సొసైటి చైర్మన్ డాక్టర్ కె. బసవ పున్నయ్య మాట్లాడుతూ ఉపకార వేతనాలు అందుకున్న విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని సత్ప్రవర్తన, వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవాలని తెలిపారు.
– సొసైటీ ముఖ్యదాత పుట్టగుంట వేణుగోపాలరావు కుమార్తె డాక్టర్ పుట్టగుంట లక్ష్మీ మాట్లాడుతూ తన తల్లిదండ్రులకు చదువు అన్నా, ప్రకతి అన్నా ప్రాణమని, తన తండ్రి సొసైటీకి రూ.కోటి విరాళం ఇవ్వడం వెనుక అంతరార్ధం అదేనని చెప్పారు. సొసైటీ కార్యదర్శి డాక్టర్ కె.కృష్ణప్రసాద్, కోశాధికారి వి.గోవర్ధనరావు,సొసైటీ యూఎస్‌ఏ ప్రతినిధి బొప్పన ద్వారకా ప్రసాద్‌లు మాట్లడారు. కార్యక్రమంలో నాట్కో ఫార్మా ప్రతినిధి ఎన్.సదాశివరావు, కొర్రపాటి రామారావు, కావూరి ప్రసాదరావు, కొల్లా శ్రీనివాసరావు, బుచ్చయ్యచౌదరి, చుక్కపల్లి రమేష్, కొత్తా ఛాయ, యడ్లపల్లి అశోక్ కుమార్, పంచుమర్తి నాగసుశీల, దండా బ్రహ్మానందం, నరేంద్రనాధ్ చౌదరి, హరేంద్రనాధ్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.


