నాడు అక్రమం.. నేడు సక్రమం
ఆదాయమే పరమావధిగా బీపీఎస్ అమలుకు కూటమి సర్కారు ఆదేశాలు అనుమతులు లేని భవనాల క్రమబద్ధీకరణకు అవకాశం జిల్లాలో వెయ్యికి పైగా అక్రమ, అనుమతులు ఉల్లంఘించిన భవనాలు ఉన్నట్లు అంచనా
చీరాల: ‘మేము కళ్లు మూసుకుంటాం.. మీరు నిర్మాణాలు చేపట్టండి తర్వాత చూసుకుందాం... బీపీఎస్ వంటి స్కీమ్‌లతో మీ నిర్మాణాలు క్రమబద్ధీకరించుకోవచ్చు’ అన్న చందంగా చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తున్న బీపీఎస్ (బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం) అక్రమ నిర్మాణదారులను ప్రోత్సహించేలా ఉందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అనుమతులు కూడా తీసుకోకుండా స్థలం ఉందని నిర్మాణాలు చేస్తున్నారు. అనుమతులు ఉన్నప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేస్తున్నారు. ఇలా భవనాలు నిర్మించి బీపీఎస్ స్కీమ్‌ల ద్వారా తిరిగి భవనాలను సక్రమం చేసుకుంటున్నారు. ఇది అక్రమదారులకు వరంగా మారింది.
ప్లాన్‌కు విరుద్ధంగా..
ఒక భవనం నిర్మించాలంటే అందుకు తగిన ప్లాను, ఎన్ని అంతస్తులు నిర్మిస్తున్నారు? అనేది ముందుగా మున్సిపల్ టౌన్‌ప్లానింగ్ అధికారులకు తెలియచేసి ప్లాన్‌ను ఆమోదించిన తర్వాత భవన నిర్మాణాలు చేపట్టాలి. కొందరు మాత్రం ప్లానుకు విరుద్ధంగా నిర్మాణాలు చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. పట్టణ, నగర ప్రాంతాల్లో అనుమతులు లేకుండా నిర్మించుకున్న గృహాలు, భవనాలు, అపార్టుమెంట్‌లను క్రమబద్ధీకరించుకునేందుకు కూటమి ప్రభుత్వం బీపీఎస్ స్కీమ్‌ను తెరపైకి తెచ్చింది. ఇదంతా కేవలం ఆదాయమే పరమావధిగా అమలు చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 2015, 2019లోనూ బీపీఎస్ ద్వారా అనధికార భవనాలను క్రమబద్ధీకరణ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. జిల్లాలో చీరాల, బాపట్ల, రేపల్లె, అద్దంకి పట్టణాల్లో వెయ్యికి పైగా భవనాలు, అక్రమ అనుమతులు ఉల్లంఘించి నిర్మించినవిగా ప్రాథమిక అంచనాలు వేశారు. బీపీఎస్ పరిధిలోకి వచ్చే భవనాలను గుర్తించడానికి సర్వే నిర్వహించాలని పట్టణ ప్రణాళికా విభాగం అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. బీపీఎస్ అమల్లో పాటించాల్సిన నిబంధనలపై అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. వాహనాల పార్కింగ్‌కు కేటాయించే సెల్లార్‌లో నిర్మాణాలను క్రమబద్ధీకరించవద్దని ఆదేశాలు జారీ చేశారు. 1985 జనవరి 1వ తేదీ నుంచి 2025 ఆగస్టు 31వ తేదీ వరకు మధ్య అనధికార నిర్మాణాలు చేపట్టి ఉండడం, అనుమతులు తీసుకున్నా వాటిని అతిక్రమించి నిర్మాణాలు చేపట్టినవి బీపీఎస్ పరిధిలోకి వస్తాయి. 120 రోజుల్లోగా సంబంధిత భవన యజమానులు దరఖాస్తులు చేసుకోవాలి. ప్రభుత్వ స్థలాలు, మాస్టర్ ప్లాన్, రహదారి ప్లాన్ లైన్, తీర ప్రాంత నియంత్రణ జోన్, వివాదంలో ఉన్న భవనాలకు ఈ ప్లాన్ వర్తించదు. ఇదిలా ఉంటే అక్రమ నిర్మాణాలను బీపీఎస్‌తో సరిచేసుకోవచ్చని అధికారులు సైతం చెప్పుకొస్తున్నట్లు సమాచారం.


