మహారాష్ట్ర దోపిడీ గ్యాంగ్ అరెస్టు
మహారాష్ట్రలోని బ్యాంకు మేనేజర్‌ను బెదిరించి రూ.8 లక్షలు దోపిడీ రంగంలోకి దిగిన బాపట్ల జిల్లా పోలీసులు బాపట్ల రైల్వేస్టేషన్‌లో కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో పట్టివేత రూ.6,72,700 నగదు, ఒక కత్తి, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం
చీరాల: మహారాష్ట్ర రాష్ట్రంలోని కో–ఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్‌ను కత్తితో బెదిరించి నగదు తీసుకుని ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశిస్తున్న ఐదుగురు సభ్యుల దోపిడీ ముఠాను బాపట్ల జిల్లా పోలీసులు రైలులో అదుపులోకి తీసుకున్నారు. ఎస్పీ బి.ఉమామహేశ్వర్ శనివారం వివరాలను వెల్లడించారు. మహారాష్ట్ర రాష్ట్రం హింగోలి నగరం పరిధిలోని మహారాష్ట్ర మధ్యవర్తి సహకారి కో–ఆపరేటివ్ బ్యాంకు మేనేజర్ వద్ద రూ.8 లక్షలు దోపిడీ చేసి రైలులో ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశిస్తుండగా మహారాష్ట్ర పోలీస్‌శాఖ అభ్యర్థన మేరకు బాపట్ల, చీరాల రైల్వేస్టేషన్లలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. బాపట్ల రైల్వేస్టేషన్‌లో కృష్ణా ఎక్స్‌ప్రెస్ రైలులో ఏకకాలంలో ఆకస్మిక తనిఖీ చేయగా రైలులో ప్రయాణిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.6,72,700 నగదు, ఒక కత్తి, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి దర్యాప్తు నిమిత్తం ముఠా సభ్యులను, నగదును మహారాష్ట్ర పోలీసుశాఖకు అప్పగించనున్నారు. శనివారం సాయంత్రం 3 గంటల సమయంలో జిల్లాలోని బాపట్ల, చీరాల రైల్వేస్టేషన్ల వద్ద ఉత్కంఠ వాతావరణం నెలకొంది. బాపట్ల, చీరాల రైల్వేస్టేషన్లలో పదుల సంఖ్యలో పోలీసులు మోహరించారు. బాపట్లలో తప్పించుకుంటే చీరాల్లో పట్టుకునేందుకు ముందస్తుగా చీరాలలో డీఎస్పీ ఎండీ మొయిన్ ఆధ్వర్యంలో పోలీసులు మోహరించారు. ఎట్టకేలకు పోలీసులకు బాపట్ల రైల్వేస్టేషన్‌లో ముఠా సభ్యులు చిక్కారు. పండగ సెలవుల నేపథ్యంలో అత్యంత రద్దీగా ఉన్న రైలులో నుంచి కేవలం మూడు నిమిషాల్లో నిందితులను పట్టుకుని నగదు స్వాధీనం చేసుకున్నందుకు బాపట్ల జిల్లా పోలీసులను డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా ప్రత్యేకంగా అభినందించారు.
మహారాష్ట్ర దోపిడీ గ్యాంగ్ అరెస్టు


