స్వచ్ఛ ఆర్టీసీలో భాగస్వాములు కావాలి
చీరాల: స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బందితో పాటు ప్రయాణికులు కూడా స్వచ్ఛ ఆర్టీసీలో భాగస్వాములు కావాలని ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్‌రెడ్డి అన్నారు. స్వచ్ఛ భారత్ – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ పరికరాలు అందించేందుకు శనివారం చీరాల ఆర్టీసీ బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి డిపో మేనేజర్ జంజనం శ్యామల అధ్యక్షత వహించారు. ఆర్టీసీ జోనల్ చైర్మన్ మాట్లాడుతూ మన ఆర్టీసీ.. స్వచ్ఛ భారత్ నినాదంతో ముందుకెళ్లాలన్నారు. బస్టాండ్ పరిశుభ్రంగా ఉంటే ప్రయాణికులు ఎక్కువ మంది వస్తారన్నారు. ప్రతి రోజూ బస్టాండ్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అందుకు పారిశుద్ధ్య సిబ్బంది పాత్ర కీలకమైందన్నారు. చెత్తా చెదారం లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలన్నారు. అలానే ఆర్టీసీలో సిబ్బందితో పాటు పారిశుద్ధ్య కార్మికులు, అద్దె బస్సులు యజమానులు, డ్రైవర్లు ఆర్టీసీ పరిధిలోకే వస్తారని, అందరి భాగస్వామ్యంతోనే ఆర్టీసీ అభివృద్ధి చెందుతుందన్నారు. ఆర్టీసీ బస్టాండ్ ఆవరణతో పాటు బస్సులను కూడా నిత్యం పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా బస్సులను కండిషన్‌లో ఉంచాలన్నారు. అలానే స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా డస్ట్‌బిన్‌లను అందించారు. సీ్త్రశక్తి పథకం ద్వారా ఆర్టీసీలో కొత్త చరిత్ర సృష్టించామన్నారు. పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తూ మహిళల నమ్మకాన్ని నిలబెట్టామని తెలిపారు. ఆర్టీసీలో నూతన బస్సుల కోసం ఏర్పాట్లు చేస్తున్నామని, త్వరలో చీరాల డిపోకు కూడా కొత్త బస్సులు అందిస్తామని తెలిపారు. అనంతరం శానిటేషన్ సిబ్బందికి సంక్రాంతి సందర్భంగా చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు. ముందుగా యూనియన్ల నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాన్ని అందించారు. బాపట్ల డీపీటీఓ విమల, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ మువ్వల వెంకటరమణారావు, న్యాయవాది బండారుపల్లి హేమంత్‌కుమార్ పాల్గొన్నారు.
ఆర్టీసీ జోనల్ చైర్మన్ సురేష్‌రెడ్డి


