నృసింహుని ఆలయంలో సంక్రాంతి సంబరాలు
మంగళగిరి టౌన్ : మంగళగిరి పట్టణంలో వేంచేసి యున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి సునీల్‌కుమార్ పేర్కొన్నారు. దేవస్థానంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. స్వామివారి కల్యాణ మైదానంలో 11వ తేదీన సంక్రాంతి సంబరాలు జరుగుతాయని తెలిపారు. ఇందులో భాగంగా ముగ్గుల పోటీలు, చిన్నారులకు ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, గాలిపటాలు ఎగురవేత నిర్వహిస్తారని చెప్పారు. 12వ తేదీన రంగవల్లుల పోటీలు జరుగుతాయని, పాల్గొనదలచిన వారు మధ్యాహ్నం 1 గంటలోపు పేర్లు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. దేవస్థాన ఆవరణలో ఆ పోటీలు జరుగుతాయని తెలిపారు. ఆ రోజు నమోదు చేసుకోని వారు 13వ తేదీన శివాలయంలో జరిగే రంగవల్లుల పోటీలకు పేర్లు నమోదు చేసుకుని పాల్గొనవచ్చని అన్నారు. 14వ తేదీన దేవస్థానం ఎదుట భోగిమంటల కార్యక్రమం జరుగుతుందని, అలాగే మొట్టమొదటి సారిగా దేవస్థానంలో నైరుతిలో ఉన్న కొట్టాయి మండపంలో సామూహిక గోదా కల్యాణం నిర్వహించనున్నామని, ఇప్పటికి 50 మంది దంపతులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని, మరో 20 మంది దంపతులను అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. 15వ తేదీన గంగిరెద్దులు, పిట్టలదొర, హరిదాసు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, 16వ తేదీన సామూహిక గోపూజ, శ్రీ స్వామివారు, అమ్మవార్ల పారువేట ఉత్సవంతో సంక్రాంతి సంబరాలు ముగుస్తాయని ఆయన తెలిపారు. రంగవల్లుల పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేస్తామని తెలిపారు.


