తమ్ముళ్ల బరితెగింపు!
చెరుకుపల్లి మండలంలో కోడి పందేలకు భారీగా ఏర్పాట్లు తూర్పు పాలెంలో 50 ఎకరాల్లో సిద్ధం అవుతున్న బరులు మరోవైపు పలుచోట్ల పెద్దస్థాయిలో పేకాట శిబిరాల నిర్వహణ టీడీపీ నాయకుల అక్రమార్జనకు సామాన్యులే సమిధలు
రేపల్లె: సంప్రదాయం పేరుతో కోడిపందేలు నిర్వహించేందుకు ఇప్పటికే నియోజకవర్గంలోని చెరువుపల్లి మండలంలోని ముఖ్య నేత ఏర్పాట్లు చేస్తున్నారు. చెరుకుపల్లి మండలం తూర్పుపాలెం సమీపంలో సుమారు 50 ఎకరాలు పొలాలను లీజుకు తీసుకొని కోడిపందేలు, గుండాటా, చక్రం ఆట, పేకాట వంటి వాటి నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు. కోడి పందేలు నిర్వహించే ప్రాంతంలో నాలుగు రకాల బరులను సిద్ధం చేస్తున్నారు. బరుల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే పెద్ద ఎత్తున స్తంభాలు, ఇతర సామగ్రిని ఆ ప్రదేశానికి చేర్చారు. పందేల నిర్వహణకు వచ్చే వారి కోసం పెద్ద వేదికలను సిద్ధం చేసి మూడు రోజులపాట రేయింబవళ్లు పోటీలు జరిగేలా భారీ ఫ్లడ్‌లైట్‌లను ఏర్పాటు చేస్తున్నారు. మంత్రి సత్యప్రసాద్ అండదండలతోనే ఏర్పాట్లు జరుగుతుండడంతో అధికారులు కన్నెత్తి కూడా చూడడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గుడ్డికాయలంక నుంచి చెరుకుపల్లి వరకు..
ప్రశాంతమైన రేపల్లె నియోజకవర్గాన్ని జూదకేంద్రంగా మార్చింది టీడీపీ నేతలే అనటంలో ఎటువంటి సందేహం లేదు. గతంలో పండుగ వేళల్లో అడపా దడపా చాటుమాటున జరిగే కోడి పందేలను బహిరంగంగా, అధికారికంగా చేసిన ఘనత పచ్చనేతలకే దక్కుతుందని బహిరంగంగానే విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుత మంత్రి.. ఎమ్మెల్యేగా ఎన్నికై న తొలినాళ్ళల్లో రేపల్లె మండలంలోని గుడ్డికాయలంకలో అట్టహాసంగా, అధికారికంగా కోడిపందేల సంస్కృతిని ప్రారంభించారు. అప్పటి నుంచి ఏటా సంక్రాంతి పండుగ పేరుతో కోడిపందేలు బహిరంగంగా నిర్వహించి రూ.కోట్లు దండుకోవటం ఆనవాయితీగా వస్తోంది. రెండేళ్ల నుంచి చెరుకుపల్లి మండలం తూర్పుపాలెంలో యథేచ్ఛగా పందేలు నిర్వహిస్తున్నా అడ్డుకునే ప్రయత్నం అధికారులు చేయకపోవటం శోచనీయం. జీవహింస, బహిరంగ కోడిపందేలు నిషేధమంటూ న్యాయస్థానాలు పదేపదే ఆదేశాలు జారీ చేస్తున్నా రేపల్లె నియోజకవర్గంలో పచ్చనేతల ఒత్తిళ్లతో అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారు. సంప్రదాయం ముసుగులో జరిగే కోడిపందేలకు, జూదశాలల నిర్వహణకు పోలీసు అధికారులు అడ్డుకట్ట వేయాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.
సంక్రాంతి పండుగ వచ్చిందంటే కోడి పందేలు, జూద శిబిరాలకు చిరునామాగా తీర ప్రాంతంలోని రేపల్లె నియోజకవర్గం మారుతోంది. సంప్రదాయం పేరుతో తెలుగు తమ్ముళ్లు అక్రమార్జనకు బరి తెగిస్తున్నారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఇలాకాలో దీనికి తోడు పచ్చ నేతలు ఇష్టారాజ్యంగా జూద శిబిరాలను నిర్వహిస్తూ సామాన్యుల జేబులను కొల్లగొడుతున్నారు. అధికారులు కన్నెత్తి కూడా చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
తమ్ముళ్ల బరితెగింపు!
తమ్ముళ్ల బరితెగింపు!


