ప్రభుత్వ సేవలన్నీ అందాలి
చీరాల: ప్రభుత్వ సేవలన్నీ ప్రజలకు సజావుగా అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ అన్నారు. గురువారం చీరాలలోని మోటార్ వాహనాల తనిఖీ అధికారి కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ ఉద్దేశాలకు అనుగుణంగా యంత్రాంగం పనిచేయాలని స్పష్టం చేశారు. వాట్సాప్ గవర్నెన్స్ అందుబాటులోకి వచ్చిందని, ప్రజలు సద్వినియోగం చేసుకునేలా విస్తృత ప్రచారం చేయాలన్నారు. ఆన్‌లైన్ ద్వారా అందుబాటులోకి వచ్చిన సేవలు వివరాలను ఉంచాలన్నారు. వాహన పోర్టల్, సారధి పోర్టల్‌లో అందుతున్న సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ప్రభుత్వం భావించినట్లుగా ప్రజలకు సక్రమమైన పద్ధతిలో సేవలు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. వాహనాల తనిఖీ అధికారి కార్యాలయం చీరాలలో రెండుళ్లుగా కొనసాగుతుండగా ఇప్పటి వరకు 2001 రిజిస్ట్రేషన్లు అయ్యాయన్నారు. ఆరుగురు సిబ్బంది ఉండగా వారి హాజరు పట్టికను పరిశీలించారు. బయోమెట్రిక్ యంత్రాన్ని ఎందుకు వినియోగించడం లేదని ప్రశ్నించారు. ఆన్‌లైన్ హాజరుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ, ఎల్‌ఎల్‌ఆర్, లైసెన్స్‌ల స్వీకరణ దరఖాస్తులు, జారీ విధానాన్ని ఆయన పరిశీలించారు. కార్యాలయాన్ని పరిశీలించి ప్రతి గదిలో ఉంచిన పాత రికార్డులు పరిశీలించారు. వాహన పోర్టల్, సారధి పోర్టల్స్ ద్వారా ప్రజలకు అందుతున్న సేవలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజూ సగటున 15 మంది లైసెన్స్ కోసం వస్తున్నారని మోటారు వాహనాల తనిఖీ అధికారి కె.రవికుమార్ ఆయన దృష్టికి తెచ్చారు. 378 వాహనాల లైసెన్స్‌లు రెన్యువల్ పొందడానికి ఆన్‌లైన్‌లో రాగా ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉండడం ఏమిటని ప్రశ్నించారు. తక్షణమే పరిశీలించి మంజూరు చేయాలని ఆదేశించారు. లైసెన్స్‌లు పొందడానికి వచ్చిన అభ్యర్థులతో ఆయన మాట్లాడారు. మధ్యవర్తులు, ఏజెంట్ల వద్దకు ప్రజలు వెళ్ళరాదని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆన్‌లైన్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న సేవలు తెలుసుకోవడానికే ఆకస్మిక తనిఖీలు చేస్తున్నామన్నారు. డ్రైవింగ్ పరీక్షల కోసం ట్రాక్ ఏర్పాటు చేయాలని, కార్యాలయానికి సొంత భవనం కేటాయించాలని ఎంవీఐ కె.రవికుమార్ కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. చీరాల ఎంవీఐ కార్యాలయానికి కలెక్టర్ వచ్చారని తెలుసుకున్న ఆర్డీఓ టి.చంద్రశేఖర్ హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. ఆయన వెంట చీరాల, వేటపాలెం తహసీల్దార్లు కె.గోపీకృష్ణ, గీతావాణి ఉన్నారు.


